
ఇగురు కూరలు, టమాటా కర్రీలు, చేపల పులుసు, నాన్‌వెజ్ వంటకాలు మరియు ముఖ్యంగా పప్పుచారు, ఆకుకూర పప్పులలో ఒక్క స్పూన్ ఈ కారం వేస్తే కూర రుచి రెట్టింపు అవుతుంది. ఆరు నెలల పాటు ఫ్రెష్‌గా ఉండే పక్కా కొలతలతో ఈ గుంటూరు కూర కారం తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

కావలసిన పదార్థాలు, పక్కా కొలతలు: అర కిలో మంచి నాణ్యమైన గుంటూరు మరియు బ్యాడగి మిర్చి కలిపిన కారం పొడి, 100 గ్రాముల నాటు ధనియాలు, 50 గ్రాములు జీలకర్ర, పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బలు, పసుపు, మరియు ఇతర మసాలా దినుసులు.

తయారీ విధానం: దినుసులను సరైన పద్ధతిలో వేయించడం స్టవ్ వెలిగించి ఒక ఐరన్ కడాయి పెట్టుకోవాలి. ఐరన్ కడాయిలో వేడి సమంగా విస్తరించి దినుసులు సమానంగా వేగుతాయి. ముందుగా 100 గ్రాముల నాటు ధనియాలను వేసి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి నెమ్మదిగా కలుపుతూ వేయించాలి.

ధనియాలు రంగు మారి కమ్మటి సువాసన రాగానే ఒక ప్లేట్ లేదా చాటలోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో 50 గ్రాముల జీలకర్ర వేసి చిన్న మంటపై వేయించి ధనియాలతో పాటు కలపాలి. వేయించిన ధనియాలు, జీలకర్ర పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

పొట్టుతో ఉన్న తాజా వెల్లుల్లి రెబ్బలను సిద్ధం చేసుకోవాలి. వెల్లుల్లి పొట్టు తీయకుండా వాడితేనే కారానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లో ముందుగా పట్టిన ధనియాలు-జీలకర్ర పొడి, కాస్త కారం పొడి, పసుపు మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి పల్స్ మోడ్‌లో ఒకేలా గ్రైండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి ముద్ద కట్టకుండా కారం, మసాలా అంతా సమంగా కలిసిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నె లేదా పళ్లెంలోకి తీసుకుని చేత్తో లేదా గరిటెతో బాగా కలపాలి.

సిద్ధమైన కూర కారాన్ని గాలి చొరబడని గాజు సీసాలో వేసి, స్పూన్‌తో గట్టిగా అదిమి పెట్టి మూత పెట్టాలి. ఇలా ఒత్తి ఉంచడం వల్ల కారం రంగు మారదు, సువాసన ఆవిరి కాకుండా 6 నెలల వరకు తాజాగా ఉంటుంది. రెండు మూడు నెలలకు ఒకసారి సరిపడా చేసుకుంటే మరింత ఫ్రెష్‌గా వాడుకోవచ్చు.