
బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్‌టీ చాలా మంచిది. ఇందులో బరువు తగ్గడానికి సహాయపడే కాటెచిన్స్ అనే ప్రత్యేక సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు జీవక్రియను వేగవంతం చేస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అలాగే మనస్సును చురుకుగా ఉంచుతాయి. జీవక్రియ బాగున్నప్పుడు, బరువు తగ్గడం సులభం అవుతుంది. గ్రీన్ టీలో కెఫిన్, పొటాషియం తక్కువ మొత్తంలో ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. కానీ సరైన సమయంలో గ్రీన్ టీ తాగడంతో మాత్రమే వాటి ప్రయోజనాలు పొందవచ్చు.

గ్రీన్ టీ తాగడానికి ఉత్తమ సమయం: గ్రీన్ టీ తాగేందుకు ఉత్తమ సమయం ఏదనే విషయానికి వస్తే.. ఉదయం లేదా వ్యాయామానికి ముందు గ్రీన్ టీ తాగడం ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు. ఉదయం కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగడం వల్ల మీరు డే మొత్తం ప్రెష్‌గా ఉండొచ్చు. ఇందులో తక్కువ మొత్తంలో కెఫిన్, ఎల్-థియనిన్ ఉంటాయి, ఇవి మానసిక స్థితిని పెంచుతాయి, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.

మీ లక్ష్యం బరువు తగ్గడం లేదా కొవ్వును కరిగించడం అయితే, వ్యాయామం చేసే ముందు గ్రీన్ టీ తాగడం మంచిది. అలా చేయడం వల్ల వ్యాయామం చేసేటప్పుడు కొవ్వు త్వరగా కరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

మీరు ఎప్పుడు గ్రీన్ టీ తాగకూడదు?: భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగడం మంచిది కాదు. గ్రీన్ టీలోని కొన్ని సమ్మేళనాలు ఆహారంలోని ఖనిజాలతో శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం కూడా హానికరం. ఎందుకంటే ఇందులో ఉండే కెఫిన్ కంటెంట్ నిద్రలేమి, ఆందోళన, అధిక రక్తపోటు, భయానికి కారణమవుతుంది. కాబట్టి, సరైన సమయంలో, మితంగా గ్రీన్ టీ తాగడం మీ ఆరోగ్యానికి మంచిది.

గ్రీన్ టీ తయారుచేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: గ్రీన్ టీ తయారుచేసేటప్పుడు, నీరు చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండకుండా చూసుకోండి. గ్రీన్ టీని 2 నుండి 3 నిమిషాల కంటే ఎక్కువసేపు నానబెట్టవద్దు. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల టీ చేదుగా మారుతుంది. అప్పుడు మీరు దాని రుచిని కోల్పోతారు.