
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికల వల్ల ద్వాదశ రాశులవారిపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. మార్చి నెలలో ఒక శక్తివంతమైన యోగం ఏర్పడనుంది. మార్చి 3 నుంచి 26 వరకు ప్రేమ, దాంపత్యం, సుఖసంతోషాలు, ఐశ్వర్యాలకు కారకుడైన శుక్రుడు తనకు ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేయనున్నాడు. శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేకమైన మహాభాగ్య యోగం ఏర్పడి, ధనలాభాలు, గౌరవం, శుభ పరిణామాలు వరుసగా చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, కుంభం, మీన రాశుల వారికి ఈ కాలం అత్యంత శుభప్రదంగా ఉండనుంది.

వృషభ రాశి.. రాశ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉచ్ఛస్థితిలో ఉండటం వలన వృషభరాశి వారికి మహాభాగ్యం కలుగుతుంది. సంపదలు, భోగభాగ్యాలు విస్తరిస్తాయి. సంపన్న కుటుంబంతో ప్రేమ లేదా వివాహ సంబంధం కుదిరే అవకాశం. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామికి అదృష్టం కలుగుతుంది. ఆశించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది.

మిథున రాశి.. శుక్రుడు దశమస్థానంలో ఉచ్ఛంగా ఉండటం వల్ల మిథునరాశి వారికి రాజయోగసమాన ఫలితాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు, ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా మెరుగైన అవకాశాలు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు. ఆకస్మిక ధనలాభం. ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది.

కర్కాటక రాశి.. భాగ్యస్థానంలో శుక్రుడి ఉచ్ఛ సంచారం మహా ధనయోగాన్ని కలిగిస్తుంది. ప్రాభవం, గుర్తింపు పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యలు తగ్గి సుఖశాంతులు నెలకొంటాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. గృహ, వాహన సౌకర్యాలు పెరుగుతాయి.

కన్య రాశి.. సప్తమస్థానంలో ధనాధిపతి శుక్రుడి సంచారం వల్ల కన్యరాశి వారికి మహాభాగ్య యోగం ఏర్పడుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ అవకాశాలు వస్తాయి. తక్కువ శ్రమకు ఎక్కువ ఫలితం. విదేశీ అవకాశాలు లభిస్తాయి. పిత్రార్జిత ఆస్తి లభించే సూచనలు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కోరికలు నెరవేరుతాయి.

కుంభ రాశి.. ధనస్థానంలో శుక్రుడు ఉచ్ఛంగా ఉండటం వల్ల కుంభరాశి వారికి ఆర్థికంగా బలమైన కాలం. సంపద, బ్యాంక్ నిల్వలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం, ప్రముఖత. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

మీన రాశి.. శుక్రుడు స్వయంగా మీనరాశిలో ఉచ్ఛస్థితిలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి విశేష శుభఫలితాలు. ప్రముఖుడిగా గుర్తింపు. రాజపూజ్యాలు, గౌరవం. ఉద్యోగంలో పురోగతి. విదేశీ అవకాశాలు. వృత్తి, వ్యాపారాల్లో తీరికలేని స్థితి. లాభదాయక పరిచయాలు. ఆదాయం వృద్ధి ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే.. ఈ కాలంలో శుక్ర అనుగ్రహం పొందిన ఈ ఆరు రాశుల వారు ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించే అవకాశం ఉంది. శుభప్రదమైన నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)