బిజీ లైఫ్‌లో కొంత మంది అవిశ్రాంతంగా పనిచేస్తుంటారు. చాలా మంది పగలు రాత్రి తేడా లేకుండా ఉద్యోగాలు చేస్తుంటారు. సమయానికి తినడానికి, నిద్రపోవడానికి కూడా సమయం ఉండదు. ఇలా అవిరామంగా పనిచేయడం మూలంగా శరీరం అలసిపోతుంది.
గంటల తరబడి నిద్ర, తిండి లేకుండా పనిచేస్తే తీవ్ర రోగాల బారిన పడవల్సి వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోకపోతే.. ఆ తర్వాత వైద్యులను సంప్రదించినా ప్రయోజనం ఉండదు.
ఈ రోజుల్లో యువతీ యువకులు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. శారీరంలో ఐరన్ లోపిస్తే అలసటతో పాటు, వివిధ లక్షణాలు కనిపిస్తాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా శరీరం అలసిపోయినట్లు అనిపించడం, కళ్లు మూతలు పడటం, కణాలలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల శ్వాస సరిగ్గా ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ముందుగా డాక్టర్ దగ్గరకు వెళ్లి అవసరమైన కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలి. పోషకాహారంపై కూడా దృష్టి పెట్టాలి. రోజూ అలసట, తలతిరగడం వంటి సమస్యలు ఉంటే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. గుండెపోటు వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి.
రక్తంలో ఐరన్ స్థాయిని పెంచడానికి ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. క్రమం తప్పకుండా చేపలు, మాంసం, గుడ్లు తినాలి. అలాగే ప్రతి రోజూ ఆకుకూరలు తీసుకోవాలి.