
ధనియాల ఎంపిక & 24 గంటల నానబెట్టుడు: కొత్తిమీర వేగంగా రావాలంటే కొత్తవి, పుచ్చుపట్టని నాణ్యమైన ధనియాలను తీసుకోవాలి. ధనియాలను రెండు బద్దలుగా పగలగొట్టాల్సిన అవసరం లేకుండానే.. ఒక గిన్నె నీటిలో వేసి పూర్తి 24 గంటల పాటు నానబెట్టాలి.

కాటన్ గుడ్డలో మూటకట్టే టెక్నిక్ 3 రోజుల మొలకలు: నానిన ధనియాలను తీసి ఒక మందపాటి కాటన్ గుడ్డలో వేసి కాస్త లూజ్‌గా మూట కట్టాలి. మరీ టైట్‌గా కడితే మొలకలు విరిగిపోతాయి. ఈ మూటను పూర్తిగా తడిపి, గాలి వెలుతురు ఉండే నీడ ప్రదేశంలో ఉంచాలి. గుడ్డ ఆరిపోకుండా రోజుకు ఒక్కసారి నీళ్లు చిలకరిస్తూ ఉంటే చాలు; సరిగ్గా 3 నుండి 5 రోజుల్లోనే ప్రతి ఒక్క ధనియం నుంచి తెల్లటి వేర్లు, పచ్చటి లేత ఆకులు బయటకు వస్తాయి!

ఆకుకూరలకు పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ కోకోపీట్ వద్దు: ఆకుకూరలు కుండీల్లో పడిపోవడానికి ప్రధాన కారణం కోకోపీట్ వాడటమేనని గుర్తుంచుకోవాలి. కోకోపీట్ వల్ల మట్టి మరీ గుల్లబారిపోయి మొలకలకు పట్టు ఉండదు. కాబట్టి 50% సాధారణ తోట మట్టి, 50% మేక ఎరువు లేదా పశువుల ఎరువు మరియు ఒక స్పూన్ వేపపిండి మాత్రమే కలిపి టబ్బులో నింపుకోవాలి.

నాటే విధానం & డిస్పోజబుల్ గ్లాస్ వాటరింగ్ టెక్నిక్: సాయిల్ మిక్స్ నింపిన టబ్బులో మొలకెత్తిన ధనియాలను ఒత్తుగా చల్లుకోవాలి. ఒత్తుగా ఉంటే ఒక మొక్కకు మరొకటి సపోర్ట్‌గా నిలబడతాయి. పైనుంచి కేవలం అర అంగుళం మట్టిని పలుచటి లేయర్‌లా కప్పి నీళ్లు చిలకరించాలి. ఇక అసలైన సీక్రెట్ ఏంటంటే.. టబ్బు మధ్యలో కొద్దిగా మట్టి తీసి, చుట్టూ రంధ్రాలు చేసిన ఒక ప్లాస్టిక్ లేదా డిస్పోజబుల్ గ్లాస్‌ను అమర్చాలి.

మనం పోసే నీటిని నేరుగా మొక్కలపై పోయకుండా ఈ గ్లాస్‌లో పోస్తే, రంధ్రాల ద్వారా వేర్లకు మాత్రమే నెమ్మదిగా తేమ అందుతుంది. దీనివల్ల మొక్కలు ఏమాత్రం నేలకొరగవు. మొదటి 3-4 రోజులు సెమీ-షేడ్‌లో ఉంచి, ఆ తర్వాత ఎండ తగిలే చోట ఉంచాలి. అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్లు గ్లాస్‌లో పోస్తుంటే సరిగ్గా 20 నుండి 25 రోజుల్లోనే గుబురుగా, తాజా సేంద్రియ కొత్తిమీర కోతకు సిద్ధమవుతుంది