
ఆదిలాబాద్ జిల్లా బోథ్ తహసిల్దార్ కార్యాలయంలో ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. కాలం చెల్లిన తహసిల్దార్ కార్యాలయంలో బిక్కు బిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నాం.. ఎప్పుడు ఏ పెచ్చు ఊడి నెత్తిన పడుతుందో అంటూ ఆందోళన చెందుతున్నాం..

ఇకనైనా కొత్త కార్యాలయాన్ని నిర్మించండి.. ఈ వానకాలం ప్రాణాలు కాపాడండి మహా ప్రభో అంటూ హెల్మెట్లు ధరించి వినూత్న నిరసన తెలిపారు సిబ్బంది.

స్థానికులు సైతం హెల్మెట్ లు ధరించి పనుల నిమిత్తం తహసీల్దారు కార్యాలయానికి రావడం కనిపించింది.

మరో వైపు బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చాలంటూ ఆందోళన చేస్తున్న రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు పెద్ద ఎత్తున హెల్మెట్లు ధరించి తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.

శిథిలావస్థలో ఉన్న ఈ తహాసిల్దార్ కార్యాలయాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించాలని నిరసన తెలిపారు.

నిజాం కాలంలో నిర్మించిన కార్యాలయం శిథిలావస్థకు చేరి నిత్ పెచ్చులు ఊడి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కార్యాలయం లో పని చేస్తున్న సిబ్బంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నామని సిబ్బంది తెలిపారు.