
జీవితాంతం చెమటోడ్చి దాచుకున్న కష్టార్జితం చేతికి అందక, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో ఓ వృద్ధ రైతు కడుపుమండి వినూత్న నిరసనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో వెలుగుచూసిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో (పీఏసీఎస్) ఏళ్ల తరబడి మూలుగుతున్న తమ సొమ్మును రాబట్టుకునేందుకు ఆ అన్నదాత చేసిన నిరసన అందరినీ కలచివేసింది.

ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామానికి చెందిన చిట్టూరి నర్సింహమూర్తి స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సుమారు రూ. 19 లక్షలు డిపాజిట్ చేశారు. వృద్ధాప్యంలో తమ అవసరాలకు అక్కరకు వస్తాయన్న ఆశతో పొదుపు చేసుకున్న ఆ మొత్తాన్ని తిరిగి తీసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. కార్యాలయం చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నా అధికారులు రకరకాల సాకులు చెబుతూ కాలయాపన చేస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చివరకు విసిగిపోయిన నర్సింహమూర్తి సోమవారం ఏకంగా మంచాన్ని తీసుకువచ్చి సహకార సంఘం కార్యాలయం ఎదుట వేసుకుని అక్కడే పడుకుని నిరసన వ్యక్తం చేశారు.

పొలాల్లో దిగి పనిచేసే శారీరక సత్తువ తమకు ఇప్పుడు లేదని, వృద్ధాప్యంలో మందుల ఖర్చులు, నిత్య జీవనానికి ఆసరాగా ఉంటాయనే ఉద్దేశంతోనే పైసా పైసా కూడబెట్టి సొసైటీలో డిపాజిట్ చేశామని నర్సింహమూర్తి, ఆయన భార్య లక్ష్మీదేవి కన్నీటిపర్యంతమయ్యారు. తీరా అవసరమైన సమయంలో అసలు సొమ్ము ఇవ్వకపోగా, కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ వృద్ధ దంపతులు వాపోయారు.

సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవసాయ సహకార సంఘంలో రైతుల డిపాజిట్ల గోల్‌మాల్ వ్యవహారం నిన్నమొన్నటిది కాదు. సుమారు 180 మంది రైతులకు సంబంధించిన దాదాపు రూ. 4.40 కోట్ల డిపాజిట్లు పక్కదారి పట్టినట్లు 2019లోనే విచారణ అధికారులు గుర్తించారు. ఆ అక్రమాలు నిర్ధారణ జరిగి ఏళ్లు గడుస్తున్నా, బాధిత రైతులకు ఇవ్వాల్సిన సొమ్ము మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు.

ప్రస్తుతం దాదాపు రూ. 3.32 కోట్ల మేర డిపాజిట్ సొమ్ము రైతులకు బకాయి పడి ఉన్నట్లు తెలుస్తోంది. నర్సింహమూర్తి చేపట్టిన ఈ ఆందోళనకు మద్దతుగా పలువురు బాధితులు, డిపాజిట్‌దారులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసనలో పాలుపంచుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రైతులకు రావాల్సిన డిపాజిట్లను తక్షణమే ఇప్పించాలని డిమాండ్ చేశారు.