
వర్షాకాలం ప్రారంభమైనా చాలా చోట్ల ఇంకా మండే ఎండలు తగ్గడం లేదు. విపరీతమైన వేడిలో తిన్న ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు. దీనికి తోడు డీహైడ్రేషన్ సమస్య కూడా వెంటాడుతుంది. అందుకే భోజనం చేసిన తర్వాత ఈ షర్బత్ తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. శరీరం కూడా తాజాగా ఉంటుంది.

కీర దోస జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. అందుకే చాలా మంది కీర దోస భోజనంతో పాటు తీసుకుంటారు. లేదంటే భోజనం తర్వాత అయినా సలాడ్‌గా తింటారు. ఈ కీర దోసతో బాడీ కూలింగ్ షర్బత్‌ను తయారు చేసుకుంటే జీర్ణసమస్యలు ఇట్టే మాయం అవుతాయి.

కీర దోస షెర్బత్ చేయడానికి.. తరిగిన కీర దోస ముక్కలు, నిమ్మకాయ, నీరు, రుచికి చక్కెర, కొద్దిగా అల్లం, కాస్తింత ఉప్పు తీసుకోవాలి. కీర దోస పరిమాణం కొంచెం ఎక్కువగా ఉంటే మంచిది. ఉదాహరణకు 250 మిల్లీలీటర్ల నీటికి కనీసం 2 మీడియం సైజు కీర దోస తీసుకోవాలి.

ముందుగా కీర దోస బాగా కడిగి, తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కీర దోస పొట్టు లేకుండా చూసుకోవాలి. నిమ్మకాయ తొక్కను కూడా తీసెయ్యాలి. ఇప్పుడు నీళ్ళు, కీర దోస, నిమ్మకాయలను కలిపి బ్లెండర్‌లో వేసి బాగా కలపాలి. ఇందులో అల్లం, కాస్తింత ఉప్పు, చక్కెరను కూడా వేసుకోవాలి.

కలిపిన మిశ్రమాన్ని వడకట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. కాస్త చల్లగా మారిన తర్వాత గ్లాసులో పోసి ఐస్ క్యూబ్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే. ఇది రుచిగా ఉండటంతోపాటు జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది. పైగా శరీరంలో నీటి సమతుల్యతను కూడా నిర్వహిస్తుంది.