
ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టూర్‌లో జస్ప్రీత్ బుమ్రా చారిత్రక ప్రదర్శన చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 టెస్టు మ్యాచ్‌ల్లో 32 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు.

అయితే, ఈ తుఫాన్ ప్రదర్శన ఉన్నప్పటికీ బుమ్రాను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పించాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఈ డిమాండ్ చేసింది ఎవరో కాదండోయ్.. 2011లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలోని జట్టుకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్న రామ్‌జీ శ్రీనివాసన్. అసలు ఈయన ఎందుకిలా అన్నాడో ఓసారి చూద్దాం..

జస్ప్రీత్ బుమ్రాను జట్టులో ఉంచకుండా ఉండడానికి అతని ఫిట్‌నెస్ ప్రధాన కారణమని రామ్‌జీ శ్రీనివాసన్ పేర్కొన్నాడు. బుమ్రా ఫిట్‌నెస్‌పై చిన్న సందేహం ఉన్నా అతనిని ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకెళ్లడం మంచికాదు. అలా చేస్తే బుమ్రాను ప్రమాదంలో పడవేసినట్లే అవుతుందని అన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీతో ప్రపంచం అంతం కాదు. అతని ఫిట్‌నెస్‌పై చిన్నపాటి సందేహం ఉన్నా.. అతన్ని జట్టులో భాగం చేయకూడదు. అతను తన కెరీర్‌లో వరుసగా 5 టెస్టు మ్యాచ్‌ల్లో ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు అంటూ బిగ్ షాక్ ఇచ్చాడు.

సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా అకస్మాత్తుగా వెన్ను సమస్య వచ్చి తప్పుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ సమయంలోనే స్కాన్ కూడా చేశారు. అయితే ఆ నివేదికను బయటకు వెల్లడించలేదు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు.