దేశవ్యాప్తంగా గణతంత్రం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్లు వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున టీమిండియా జెర్సీతో పాటు ఆర్మీ యూనిఫామ్‌లతో కనిపించే కొందరు ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం రండి.
మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పటి నుంచో భారత సైన్యంలో చేరాలని కోరుకునేవాడు. క్రికెటర్ అయిన తర్వాత అతని కల నెరవేరింది. ధోనీకి 2011లో టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ ర్యాంక్ లభించింది. ఆ తర్వాత అతను చాలాసార్లు ఆర్మీ సైనికులను కలిశాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు వైమానిక దళంలో గౌరవ ర్యాంక్ లభించింది. 2011లో వైమానిక దళం సచిన్‌ను గ్రూప్ కెప్టెన్ హోదాతో సత్కరించింది. అప్పటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ పీవీ నాయక్ సచిన్‌కు గ్రూప్ కెప్టెన్ బిరుదును అందించారు.
దేశానికి తొలి ప్రపంచకప్ అందించిన భారత కెప్టెన్ కపిల్ దేవ్‌కు ఆర్మీలో గౌరవ ర్యాంక్ కూడా ఉంది. 2008లో అతనికి లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది.
ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అభినవ్ బింద్రాకు ఆర్మీలో గౌరవ ర్యాంక్ కూడా ఉంది. 2008లో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి, 2011లో ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ పొందాడు.