
Rohit Sharma ODI Retirement: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకరైన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు తెరపడనుంది. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే అతడు వన్డే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. అలాగే 2027 ప్రపంచకప్ ప్రణాళికల నుంచి సెలెక్టర్లు అతడిని పూర్తిగా పక్కన పెట్టేశారు.

భారత క్రికెట్‌కు 2007 నుంచి విశేష సేవలు అందిస్తున్న రోహిత్ శర్మ భవిష్యత్తుపై గత కొన్ని నెలలుగా వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ హిట్‌మ్యాన్ కెరీర్‌లో ఆఖరి వన్డే కానుందని జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ సెలెక్టర్లు, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్ భవిష్యత్తు జట్టుపై స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారు. 2027 ప్రపంచకప్ నాటికి రోహిత్‌కు 41 ఏళ్లు వస్తాయని, వయసు రీత్యా వచ్చే ఫిట్‌నెస్ సమస్యలు, గాయాలను దృష్టిలో ఉంచుకుని అతనిని పక్కన పెట్టాలని బోర్డు నిర్ణయించింది. ఈ చేదు నిజాన్ని సెలెక్టర్లు ఇప్పటికే రోహిత్‌కు అధికారికంగా తెలియజేశారు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు జోడీగా కొత్త రక్తాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది.

తాజా నివేదికల ప్రకారం, ఈ సిరీస్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మ బీసీసీఐ (BCCI) అధికారులతో మాట్లాడాడు. తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా శ్రమించిన రోహిత్, వన్డేల్లో మరికొంత కాలం కొనసాగాలని గట్టిగా ఆశపడ్డాడు. కానీ సెలెక్టర్లు మాత్రం భవిష్యత్తు దృష్ట్యా అతనిని పక్కన పెట్టడానికే మొగ్గు చూపారు. ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. తనను జట్టు నుంచి తొలగించే విధానం సరిగ్గా లేదని అతడు భావించినప్పటికీ, సెలెక్టర్లు మాత్రం "ఇంగ్లాండ్ పర్యటన తర్వాత మా దారి మాదే" అని తేల్చి చెప్పారు. భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను రోహిత్ కోర్టులోనే పెట్టారు. మరోవైపు యశస్వి జైస్వాల్ లాంటి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్‌కు సుదీర్ఘ అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.

2025 లో పరుగుల వరద పారించిన రోహిత్ శర్మకు, 2026 సంవత్సరం మాత్రం అస్సలు కలిసిరాలేదు. ఈ ఏడాది ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌లలో కేవలం 30 సగటుతో, 88.6 స్ట్రైక్ రేట్‌తో 241 పరుగులు మాత్రమే చేశాడు. దీనికి తోడు ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లోని మొదటి రెండు వన్డేల్లోనూ రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ వరుస వైఫల్యాలు సెలెక్టర్లకు అతనిని శాశ్వతంగా పక్కన పెట్టడానికి మరింత బలాన్ని ఇచ్చాయి.

కెరీర్ ఆరంభంలో సాధారణ ఆటగాడిగా ఉన్న రోహిత్ శర్మను 2013 లో అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని ఓపెనర్‌గా ప్రమోట్ చేయడంతో అతని కెరీర్ ఆకాశాన్ని తాకింది. వన్డే క్రికెట్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక వీరుడు రోహిత్.

మొత్తంగా 286 వన్డే మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 48.67 సగటుతో 11,731 పరుగులు చేశాడు. ఇందులో 33 సెంచరీలు (ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మూడో అత్యధికం) ఉన్నాయి. రోహిత్ శర్మ కేవలం బ్యాటర్‌గానే కాకుండా, 2023 ప్రపంచకప్‌లో భారత జట్టును అద్భుతమైన దూకుడు ఆటతీరుతో నడిపించి రన్నరప్‌గా నిలబెట్టిన కెప్టెన్‌గా కూడా అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు.