
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమవుతున్న వేళ క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఒకవైపు యువ ఆటగాళ్లు ఈ మెగా లీగ్‌లోకి అరంగేట్రం చేస్తుంటే, మరోవైపు భారత దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ సహా ఐదుగురు స్టార్ ఆటగాళ్లు ఈ సీజన్ తర్వాత ఆటకు స్వస్తి పలికే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మహేంద్ర సింగ్ ధోనీ: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన 19వ సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే 45 ఏళ్లకు చేరువైన ధోనీ, గత కొన్ని సీజన్లుగా తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలకు తెరదించే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నాయకత్వ మార్పు విజయవంతంగా జరగడం, రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో జట్టు నిలదొక్కుకోవడం వల్ల ధోనీ ఈ ఏడాది ఆఖరి సారి మైదానంలో కనిపించవచ్చు.

మిచెల్ స్టార్క్: ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన మిచెల్ స్టార్క్ సైతం ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ కు దూరం కావచ్చని సమాచారం. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్క్, వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ కోసం తన ఫిట్‌నెస్ కాపాడుకోవాలని చూస్తున్నారు. 36 ఏళ్ల వయసులో పనిభారాన్ని తగ్గించుకోవడానికి ఆయన లీగ్ క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది.

మనీష్ పాండే: ఐపీఎల్ లో సెంచరీ బాదిన తొలి భారతీయుడు మనీష్ పాండే గత ఐదేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు ఇది నిర్ణయాత్మక సీజన్.

సునీల్ నరైన్: మరోవైపు కేకేఆర్ స్టార్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ కూడా 37 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ దిశగా అడుగులు వేస్తున్నాడు. జట్టులో కొత్త విదేశీ ఆటగాళ్ల రాకతో నరైన్ స్థానానికి పోటీ పెరగడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఇషాంత్ శర్మ: తొలి సీజన్ నుంచి ఐపీఎల్ లో కొనసాగుతున్న అతికొద్ది మంది ఆటగాళ్లలో ఇషాంత్ శర్మ ఒకరు. ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్న ఇషాంత్, గత కొన్ని ఏళ్లుగా గాయాల బారిన పడుతుండటంతో వరుసగా మ్యాచ్‌లు ఆడలేకపోతున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న ఇషాంత్‌కు ఈ సీజన్ ఘనమైన వీడ్కోలు పలికే వేదిక కానుంది.