- Telugu News Photo Gallery Cricket photos Liton Das to captain Bangladesh after Tamim’s shock resignation but Shakib Al Hasan will lead for 2023 World Cup, says report
Bangladesh Cricket: బంగ్లాదేశ్ వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపిక.. కానీ మెగా టోర్నీలో కెప్టెన్సీ పగ్గాలు అతనికే..?
Bangladesh Cricket: బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది మరియు మిగిలిన మ్యాచ్‌లలో బంగ్లాదేశ్ జట్టుకు లిటన్ దాస్ నాయకత్వం వహిస్తాడు. కానీ భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఆ ఆల్‌రౌండర్‌ని..
Updated on: Jul 07, 2023 | 7:28 PM

Bangladesh Cricket: బంగ్లాదేశ్ దిగ్గజ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ అనూహ్యంగా గురువారం రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ పదవికి లిటన్ దాస్‌ను ఎంపిక చేసినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే 2 మ్యాచ్‌లు ఆయిపోగా.. మిగిలిన 3వ మ్యాచ్‌లలో బంగ్లా జట్టుకు లిటన్ దాస్ నాయకత్వం వహించనున్నాడు.

అయితే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టుకు అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ నాయకత్వం వహిస్తాడని సమాచారం. కానీ దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

లిట్టన్ దాస్ ఇప్పటికే బంగ్లాదేశ్ తరఫున 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 3 ఫార్మాట్లలో బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉంది. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న లిటన్, తమీమ్ రిటైర్‌మెంట్‌తో బంగ్లా జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు.

భారత్‌తో గతేడాది డిసెంబర్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో లిటన్ బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహించాడు. ఆ సిరీస్‌లో బంగ్లా జట్టు స్వదేశంలో భారత జట్టును 2-1 తేడాతో ఓడించింది. ఇంకా గాయం కారణంగా షకీబ్ అల్ హసన్ లేకపోవడంతో గత నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ జట్టుకు అతను నాయకత్వం వహించాడు.

కాగా, తమీమ్ జూలై 6న అన్ని ఫార్మాట్ల నుంచి అనూహ్యరీతిలో రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే తదుపరి చర్యపై చర్చించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్ హసన్ గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే 3వ వన్డేకి తాను కెప్టెన్‌గా వ్యవహరిస్తానని లిటన్ ధృవీకరించాడు. మరోవైపు రిటైర్‌మెంట్‌పై తమీమ్ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని అతన్ని అభ్యర్థించారు.





























