
Jadeja Dhoni Rift Rumors: ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ పాత, కొత్త ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రీయూనియన్ కార్యక్రమం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వేడుకలో జట్టులోని దాదాపు అందరూ స్టార్ ఆటగాళ్లు కనిపించినప్పటికీ, జడేజా, ధోనీ ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం కెమెరాలకు చిక్కింది.

దీంతో వీరిద్దరి మధ్య మళ్ళీ కోల్డ్ వార్ మొదలైందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వివాదం తెగ ట్రెండ్ అవుతోంది. ఈక్రమంలో ఈ వివాదంపై స్పందించిన జడేజా, అది కేవలం సాంకేతిక కారణమే తప్ప మనస్పర్థలు కావని స్పష్టం చేయడంతో ఫ్యాన్స్ ఊపరి పీల్చుకున్నారు.

ఆ సంఘటన గురించి జడేజా మాట్లాడుతూ.. "నేను రీయూనియన్‌కు వెళ్లే ముందే మా 'మహీ భాయ్'కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారో అడుగుదామనుకున్నాను. కానీ ఆ సమయంలో ఆయన ఫోన్ స్విచాఫ్‌లో ఉంది. వేడుక జరిగే ప్రదేశంలో కూడా చాలా రద్దీగా ఉండటం, వేర్వేరు కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల మేమిద్దరం మాట్లాడుకునే అవకాశం దక్కలేదు. అంతే తప్ప మా మధ్య ఎలాంటి గొడవలు లేవు," అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. ధోనీకి ఫోన్ చేయడం కంటే ఆయనను నేరుగా కలవడమే కష్టమని, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫోన్ వాడుతారో ఎవరికీ తెలియదని జడ్డూ సరదాగా వ్యాఖ్యానించాడు.

గతంలో 2022 ఐపీఎల్ సమయంలో కెప్టెన్సీ మార్పుల వల్ల జడేజా, ధోనీ మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అయితే 2023 ఫైనల్‌లో జడేజా ఆఖరి బంతికి ఫోర్ కొట్టి జట్టును విజేతగా నిలిపిన తర్వాత, ధోనీ అతడిని ఎత్తుకుని సంబరాలు చేసుకోవడంతో ఆ వార్తలకు తెరపడింది. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న విషయాలను పెద్దవి చేయవద్దని జడేజా అభిమానులను కోరాడు. ధోనీ తనకు ఎప్పుడూ గురువు, మార్గదర్శి అని ఆయన గౌరవాన్ని ఎప్పటికీ తగ్గించనని జడ్డూ పునరుద్ఘాటించాడు.

ఈ రీయూనియన్ వివాదంపై జడేజా ఇచ్చిన స్పష్టతతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పసుపు జెర్సీలో ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి ఆడుతుంటే చూడటమే తమకు పండగని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ, జడేజా ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. సంజూ శాంసన్ ట్రేడ్ ద్వారా చెన్నై జట్టులోకి వచ్చాడు.