- Telugu News Photo Gallery Cricket photos India vs England 5th Test Cancelled and English Media Targets Teamindia Telugu Cricket News
Ind vs Eng: చివరి టెస్ట్ రద్దుతో ఇంగ్లీష్ మీడియా ఓవర్ యాక్షన్.. భారత్‌ను టార్గెట్ చేస్తూ కథనాలు..!
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగాల్సి ఉంది. కానీ, కరోనా నేపథ్యంలో ఈ చివరి టెస్ట్ మ్యాచ్ రద్దైంది.
Updated on: Sep 11, 2021 | 8:50 AM

కరోనా కారణంగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య ఐదవ మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. దీని తర్వాత సిరీస్ ఫలితానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే సమయంలో, ఇంగ్లండ్ మీడియా భారతదేశాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఈ మొత్తం వివాదం ఆగస్టు 31 నుంచి మొదలైందని పేర్కొంది.

గత వారం, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి లండన్‌లో జరిగిన పుస్తకావిష్కరణకు హాజరయ్యారు. ఈ పుస్తకాన్ని శాస్త్రి స్వయంగా రాశారు. ఈ ఇద్దరితో పాటు, కోచింగ్ సిబ్బందిలోని మరికొందరు సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సెప్టెంబర్ 5 న, శాస్త్రికి కరోనా లక్షణాలు కనిపించడంతో యాంటిజెన్ పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. మరుసటి రోజు RT-PCR పరీక్షను నిర్వహించగా, అందులోనూ పాజిటివ్ అని తేలింది. జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లు కూడా పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. సెప్టెంబరు 7 న శాస్త్రి, కోహ్లీ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లడంతో బిసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వారిద్దరి నుంచి బోర్డు వివరణ కోరినట్లు తెలిసింది.

సెప్టెంబర్ 9 న, టీమిండియా సహాయక సిబ్బందిలోని మరొక సభ్యుడు - అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ యోగేష్ పర్మార్ కోవిడ్ -19 పాజిటివ్‌గా గుర్తించారు. దీని తర్వాత రెండు జట్ల క్రికెట్ బోర్డుల సమావేశం జరిగింది. భారత జట్టు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేశారు. అందరికీ నెగిటివ్ వచ్చింది. కానీ, ప్రాక్టీస్ సెషన్ రద్దు చేయడంతో హోటల్ గదులకే పరిమితం అయ్యారు.

అంతకుముందు సెప్టెంబర్ 10న ఉదయం, మ్యాచ్ మొదటి రోజు ఆటను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయనే నివేదికలు వెలువడ్డాయి. అనంతరం మధ్యాహ్నానికి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు రెండు బోర్డులు ప్రకటించాయి.





























