- Telugu News Photo Gallery Cricket photos IND vs AUS: India’s Journey To The Finals Of The ICC World Cup 2023
World Cup 2023: చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో.. ప్రపంచకప్‌లో భారత్ ప్రయాణం సాగిందిలా.. ఫొటోస్
2023 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ ను ఓడించడం ద్వారా టీమిండియా వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. అలాగే అజేయంగా వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ అందుకునేందుకు రోహిత్ సేన ఒక్క అడుగు దూరంలో ఉంది. మరి ఈ మేజర్ టోర్నీలో మన ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి చూద్దాం రండి.
Updated on: Nov 17, 2023 | 1:58 PM

2023 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ ను ఓడించడం ద్వారా టీమిండియా వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. అలాగే అజేయంగా వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ అందుకునేందుకు రోహిత్ సేన ఒక్క అడుగు దూరంలో ఉంది. మరి ఈ మేజర్ టోర్నీలో మన ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి చూద్దాం రండి.

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ భారత బౌలర్లు ఆస్ట్రేలియాను 199 పరుగులకే పరిమితం చేశారు. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. జట్టులోని ముగ్గురు ప్రధాన బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. అయితే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.

భారత్ రెండో మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఈ ఛాలెంజ్‌ని 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టీమ్ ఇండియా పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 84 బంతుల్లో 131 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

భారత్ తన మూడో మ్యాచ్ లో పాకిస్థాన్ తో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కేవలం 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమిండియా 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ అర్ధసెంచరీలతో రాణించారు

భారత్ నాలుగో మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరిగింది. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సవాలును పూర్తి చేసింది. విరాట్ కోహ్లీ 103 నాటౌట్, శుభ్‌మన్ గిల్ 53, రోహిత్ శర్మ 48 పరుగులు చేశారు.

భారత్ ఐదో మ్యాచ్ న్యూజిలాండ్ తో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. 48వ ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి టీమ్ ఇండియా లక్ష్యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 95, రోహిత్ శర్మ 46, రవీంద్ర జడేజా 39 పరుగులు చేశారు.

భారత్ తన ఆరో మ్యాచ్ ఇంగ్లండ్‌తో ఆడింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కానీ ఇంగ్లాండ్ జట్టు 34.5 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది. షమీ 4, బుమ్రా 3, కుల్దీప్ 2 వికెట్లు తీశారు.

భారత్ ఏడో మ్యాచ్ లో శ్రీలంకతో తలపడింది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ చేసింది. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. కానీ శ్రీలంక జట్టు 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

భారత్ ఎనిమిదో మ్యాచ్ దక్షిణాఫ్రికాతో జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 83 పరుగులకే ఆలౌటైంది. భారత్ తరఫున రవీంద్ర జడేజా 5, కుల్దీప్ 2, షమీ 2 వికెట్లు తీశారు.

భారత్‌కు తొమ్మిదో చివరి లీగ్ మ్యాచ్ నెదర్లాండ్స్‌తో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అలాగే నెదర్లాండ్స్‌ను 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ చేసింది.

ఇక కీలకమైన సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకే ఆలౌటైంది. దీంతో 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌లోకి సగర్వంగా అడుగుపెట్టింది రోహిత్ సేన.




