
West Indies ODI Series: భారత జట్టు శ్రీలంక సిరీస్ తర్వాత కొంత విరామం తీసుకుంటోంది. వచ్చే వారం నుంచి ఆఫ్టానిస్తాన్‌తోపాటు ఏసియా గేమ్స్, వెస్టిండీస్ సిరీస్‌లతో బిజీగా మారనుంది. ఈక్రమంలో ఇప్పటికే ఆఫ్ఘాన్ సిరీస్‌కు టీంను ఎంచుకోగా, వెస్టిండీస్‌తో జరగనున్న 3 వన్డేల సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 27 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ఇప్పటికే బీసీసీఐ అధికారిక షెడ్యూల్ ప్రకటించింది.

తొలి వన్డే తిరువనంతపురంలో, రెండో మ్యాచ్ గువాహటిలో, మూడో వన్డే న్యూ చండీగఢ్‌లో జరగనున్నాయి. ఇదే సమయంలో 2026 ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. ఈ రెండు టోర్నీల తేదీలు కలవడంతో భారత వన్డే జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. దీంతో చాలాకాలంగా వన్డే జట్టుకు దూరంగా ఉన్న రిషభ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, మహ్మద్ సిరాజ్లకు తిరిగి అవకాశం లభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.

రిషభ్ పంత్..: రిషభ్ పంత్ 2024లో శ్రీలంక పర్యటనలో చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత కొన్ని సిరీస్‌లకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కలేదు. 2026 ఆరంభంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. ఆసియా క్రీడల జట్టులో ఇషాన్ కిషన్ ఉండటంతో విండీస్ సిరీస్‌లో పంత్‌కు అవకాశం రావచ్చని నివేదిక పేర్కొంది.

రుతురాజ్ గైక్వాడ్..: రుతురాజ్ గైక్వాడ్ వన్డేల్లో పరిమిత అవకాశాలే అందుకున్నాడు. గత ఏడాది దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీతో అతడికి అవకాశం లభించింది. సిరీస్ చివరి మ్యాచ్‌లో శతకం సాధించినప్పటికీ ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ ఆసియా క్రీడల్లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్న నేపథ్యంలో గైక్వాడ్‌కు మళ్లీ ఛాన్స్ లభించవచ్చని అంచనా.

మహ్మద్ సిరాజ్..: మహ్మద్ సిరాజ్ ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడాడు. ఆ తర్వాత అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లకు ఎంపిక కాలేదు. ఆసియా క్రీడల కోసం జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోతే, సిరాజ్ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.