భారతీయ సంప్రదాయ వంటకాల్లో రుచి, వాసన, ఆరోగ్య ప్రయోజనాల కోసం దాల్చిన చెక్కని ఉపయోగిస్తుంటారు. ఇది సువాసన, రుచే కాకుండా శరీరానికి మంచి లాభాలను కూడా అందిస్తుంది.
దాల్చినచెక్క నుంచి తీసిన నూనెతో పెర్ఫ్యూమ్‌లు, క్రీమ్‌లు, లిప్ బామ్‌లు, స్క్రబ్‌లు తయారు చేస్తున్నారు. చర్మాన్ని కాంతివంతం చేయడానికి, మొటిమలను తగ్గించడానికి, వృద్ధాప్య ఛాయలను నివారించడానికి దాల్చినచెక్క సహాయపడుతుంది.
ముడతలను నివారించడంలో దాల్చిన చెక్క చక్కగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ లో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలిపి ముఖంపై అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
ఒక టీస్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ తేనెకు ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపిన ఫేస్ ప్యాక్ ఆరిపోయే వరకు ముఖంపై ఉంచుకోవాలి. గోరువెచ్చని నీళ్లతో ముఖం కడిగితే చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగిస్తుంది.
మొటిమలకు సంబంధించిన మచ్చలు చర్మంపై ఇబ్బందిగా కనిపిస్తాయి. వీటిని పోగొట్టు్కునేందుకు రెండు చెంచాల కొబ్బరి నూనెలో ఒక చెంచా దాల్చిన చెక్క కలిపి ముఖంపై అప్లై చెయ్యాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగితే మచ్చలను తగ్గించుకోవచ్చు.
చర్మం మృదువుగా మారేందుకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. ఒక టీస్పూన్ తేనెలో ఒక టీస్పూన్ సీ సాల్ట్, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి ముఖంపై మసాజ్ చేయాలి. కాసేపటి తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.