
సినిమా మేకింగ్ మాత్రమే కాదు, ఆ సినిమాను ఆడియన్స్ దృష్టిలో పడేలా చేయటం కూడా పెద్ద టాస్కే. స్టార్ హీరోల సినిమాలకు కాస్త బజ్ ఉంటుంది. అలా అని సరిపెట్టుకుంటే కుదరదు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో పబ్లిసిటీనే కీ రోల్ ప్లే చేస్తుంది. కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగితే తప్ప సినిమాను జనంలోకి తీసుకెళ్లటం సాధ్యంకాదు.

సక్సెస్‌కు ప్రమోషన్ ఎంత కీలకమో ముందే కనిపెట్టారు మోడ్రన్ మాస్టర్ రాజమౌళి. అందుకే తన సినిమాల ప్రమోషన్ కోసం సినిమా షెడ్యూల్స్ రేంజ్‌లో పబ్లిసిటీకి కూడా ప్లానింగ్ సెట్ చేస్తున్నారు. జక్కన్న సెట్ చేసిన ట్రెండ్‌ను టాలీవుడ్ మేకర్స్ అంతా పక్కాగా ఫాలో అవుతూ వస్తున్నారు.

ప్రమోషన్లో కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలు మన రేంజ్‌లో బజ్ క్రియేట్ చేయలేకపోతున్నాయి. బడ్జెట్ మార్కెట్ పరంగా ఆ హీరోలకు అంత రేంజ్ లేకపోవటం, వాళ్లకు నార్త్ మార్కెట్ మీద పెద్దగా ఆశలు లేకపోవటం లాంటి కారణాలతో కొన్ని ఏరియాస్‌లో ప్రమోషన్స్‌ను నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ మీద స్పష్టంగా కనిపిస్తోంది.

బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి మరీ దారుణం. ఒకటి రెండు ప్రెస్‌మీట్స్ తప్ప నార్త్ స్టార్స్‌కు పెద్దగా ప్రమోషన్స్ అలవాటు లేదు. అందుకే వాళ్లు పాన్ ఇండియా మార్కెట్‌ను కనీసం ఊహించలేకపోతున్నారు. ఇప్పటికీ రీజినల్ సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నారు.
