Ram Naramaneni |
Apr 23, 2023 | 8:00 PM
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినీనటుడు శరత్‌బాబు హైదరాబాద్‌లోని AIG ఆసుపత్రిలో చేరారు. కొద్దిరోజుల క్రితం శరత్‌బాబు అనారోగ్య సమస్యలతో చెన్నైలోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఆయన్ను కొద్దివారాల క్రితం వైద్యుల సూచనల మేరకు బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స కోసం నటుడు శరత్‌బాబుని 20వ తేదీన హైదరాబాద్ AIGకి మార్చారు. శరత్ బాబుకి మల్టీఆర్గాన్ డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్స్ ఇష్యూతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం శరత్‌బాబు గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని చెప్తున్నారు వైద్యులు.
ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక అభిమానం సంపాదించుకున్నారు శరత్‌బాబు. ఆయన వయసు 72 ఏళ్ళు. చిత్రపరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చినా ఆయన చెన్నైలోనే సెటిల్ అయ్యారు.
కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. శరత్‌బాబు సెప్సిస్‌తో బాధపడుతున్నారని, దాని కారణంగా కిడ్నీలు, ఊపిరితిత్తులు, లివర్ సమస్యలేర్పడ్డాయనీ వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
1973 రామరాజ్యం సినిమా ద్వారా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన శరత్‌బాబు ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 250కిపైగా సినిమాల్లో నటించారు. చివరిగా వకీల్‌సాబ్ సినిమాలో కనిపించారు. ఓ పక్క మూవీస్‌లో నటిస్తూనే బుల్లితెరపైనా ప్రేక్షకులను మెప్పించారు శరత్‌బాబు. అనేక తెలుగు, తమిళ టీవీ సీరియళ్లలో నటించారు శరత్‌బాబు. ఈ సీనియర్ నటుడు అనారోగ్యానికి గురయ్యారనే వార్త టాలీవుడ్‌లో కలవరాన్ని నింపింది. ప్రస్తుతం శరత్‌బాబుకు ICUలో చికిత్స చేస్తున్నారు. ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆయన వయసు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ దృష్ట్యిలో పెట్టుకుని అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నారు.