
దూరపు కొండలు నునుపు అని ఊరికే అనలేదు పెద్దలు. మన నిర్మాతల తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుందిప్పుడు. ముందున్న మంచి రిలీజ్ డేట్స్ వదిలేసుకుని.. ఎక్కడో ఉన్న డేట్స్ కోసం పరుగులు పెడుతున్నారు.

అసలేమైందో తెలియదు గానీ వరసగా రెండో వారాన్ని కూడా ఖాళీగా వదిలేసారు టాలీవుడ్ నిర్మాతలు. మరి ఎందుకిలా చేస్తున్నారు..? ఇన్ని డేట్స్ ఎందుకు వదిలేస్తున్నారు..? రెండు నెలల కింద సెప్టెంబర్‌లో భారీ పోటీ కనిపించింది. ఓ వైపు ఖుషి.. మరోవైపు జవాన్.. ఇంకోవైపు సలార్.. స్కంద అంటూ చాలా సినిమాలు క్యూ కట్టాయి.

కానీ ఇప్పుడు వాటిలో సగం పోస్ట్ పోన్ అయిపోయాయి. ఇప్పటికే సలార్ వాయిదా కన్ఫర్మ్ కాగా.. ఖుషీతో పాటు జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఆన్ డేట్ వచ్చేసాయి. అయితే సెప్టెంబర్‌లో రెండు వారాలను ఖాళీగా వదిలేసారు నిర్మాతలు. బంగారం లాంటి వినాయక చవితి వీకెండ్ తీసుకెళ్లి మార్క్ ఆంటోనీ చేతుల్లో పెట్టారు మన నిర్మాతలు.

అలాగే ఇప్పుడు సెప్టెంబర్ 22 శుక్రవారం సైతం వదిలేసారు. ఈ వారం కూడా అన్నీ చిన్న సినిమాలే వచ్చాయి. అందులో కనీసం సగం సినిమాల గురించి ఎవరికీ తెలియదు కూడా. ప్లానింగ్ లేని రిలీజ్‌లతో రెండు వారాల్ని అలా గాలికి వదిలేసి.. సెప్టెంబర్ 28 వీకెండ్ కోసం 4 సినిమాలు పోటీ పడుతున్నాయిప్పుడు.

సెప్టెంబర్ 28న ముందు సలార్ రావాల్సి ఉన్నా.. అది వాయిదా పడటంతో స్కంద, చంద్రముఖి 2 ఆ డేట్ తీసుకున్నాయి. అలాగే మరుసటి రోజు పెదకాపు వచ్చేస్తున్నాడు.

స్కంద అంటే ఓకే కానీ.. చంద్రముఖి 2, పెదకాపు లాంటి సినిమాలకు సెప్టెంబర్ 22 బెస్ట్ ఆప్షన్. కానీ దాన్ని కాకుండా పోటీలోనే వస్తున్నారు వాళ్లు. కారణమేంటో తెలియదు కానీ రిలీజ్ డేట్స్ విషయంలో నిర్మాతల తీరు అర్థం కావట్లేదు.