
పెద్ద సినిమాల్లేవు.. స్టార్ హీరోలు ఇప్పట్లో వచ్చేలా లేరు.. అలాగని చూస్తూ కూర్చుంటామా..? ఏదో ఒకటి చేయాల్సిందే అంటున్నారు నిర్మాతలు. అవసరమైతే రీ రిలీజ్ కాదు.. రీ రీ రిలీజ్ చేయడానికి కూడా రెడీ అంటున్నారు. ఇదే జరుగుతుందిప్పుడు.

అకేషన్‌తో పనిలేకుండా.. అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డులా వచ్చిన సినిమాల్నే మళ్లీ మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఈ సీన్ ఇప్పుడు టాలీవుడ్‌కు బాగా సెట్ అవుతుంది.

రిలీజ్, రీ రిలీజ్ స్టేజ్ దాటి.. రీ రీ రిలీజ్ వరకు వెళ్లిపోతున్నారు మనోళ్లు. థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి.. పెద్ద సినిమాలేం రావట్లేదు కదా అని రీ రిలీజ్ చేసిన సినిమాల్నే మళ్లీ రిలీజ్ చేస్తున్నారు.

ఫిబ్రవరి 23న ఒక్కడు మూడోసారి వస్తుంటే.. మార్చ్ 1న సింహాద్రి కూడా మూడోసారి దండయాత్రకు రెడీ అవుతున్నాడు. సినిమాల్లేక ఎలాగూ ఇప్పుడు థియేటర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. వచ్చినా అన్నీ చిన్న సినిమాలే.

అందుకే ఈ డ్రై పీరియడ్‌ను పాత సినిమాలతో నింపాలని చూస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఆల్రెడీ రీ రిలీజ్ అయిన ఒక్కడు, సింహాద్రిని మరోసారి విడుదల చేస్తున్నారు. ఇక మార్చ్ 1న రవితేజ కిక్ రీ రిలీజ్ అవుతుంది.

వెంకీకి వచ్చిన రెస్పాన్స్ చూసి.. దీన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. మార్చ్ 2న బాలయ్య ఇండస్ట్రీ హిట్ సమరసింహారెడ్డిని రీ రిలీజ్ చేస్తున్నారు. ఒక్కడు, సింహాద్రి, కిక్ అకేషన్ లేకుండానే విడుదలవుతున్నాయి.

కానీ సమరసింహారెడ్డిని 25 ఇయర్స్ సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇవే కాదు.. శివ, ఇంద్ర లాంటి సినిమాలను కూడా మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.