
నడిగర్ సంఘం బిల్డింగ్ కంప్లీట్ కావాలి.. నేను పెళ్లి చేసుకోవాలి.. ఇదీ ఇన్నాళ్లు విశాల్ పట్టిన మొండిపట్టు. ఆయన కోసమే అన్నట్టు నడిగర్ సంఘం బిల్డింగ్ పనులు పూర్తి కావచ్చాయి. ఇంతకు మించిన శుభ తరుణం ఏం ఉందని తన పెళ్లి గురించి అనౌన్స్ చేసేశారు ఈ స్టార్.

నాకు 15 ఏళ్లుగా విశాల్‌తో పరిచయం ఉంది. ఎక్కడ కనిపించినా చాలా గౌరవంగా పలకరిస్తారు. మా ఇంటివరకూ వచ్చి, నాకున్న ఓ సమస్యను పరిష్కరించిన హీరో నాకు గుర్తున్నంత వరకూ తనొక్కరే. నాకు ఎప్పుడు ఏం కావాలన్నా ముందుండేవారు.. అంటూ విశాల్ గురించి గుక్కతిప్పుకోకుండా చెబుతున్నారు సాయి ధన్సిక.

నటిగా నిలదొక్కుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నానంటున్నారు ఈ లేడీ. విశాల్‌తో గత కొన్నాళ్లుగా చనువు పెరిగిందని, కచ్చితంగా ఇది పెళ్లికి దారి తీస్తుందని, ఇద్దరికీ అనిపించాక.. ఈ నిర్ణయానికి వచ్చామని సాయిధన్సిక అనౌన్స్ చేశారు. ఆమె నటించిన 'యోగి డా' సినిమా వేడుకలో పెళ్లి గురించి అనౌన్స్ చేసేసిందీ జోడీ.

ఆగస్గు 29న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి తర్వాత ధన్సిక నటిస్తారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది. విశాల్ ఆనందంగా ఉండటమే తన ధ్యేయమని చెప్పారు ధన్సిక. ఆమె మాట్లాడుతున్నంత సేపు విశాల్ సిగ్గు పడటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2022లో కామెడీ ఎంటర్టైనర్ చిత్రం షికారులో ప్రధాన పాత్రలో నటించింది ఈ బ్యూటీ. ఇది ఈమెకు తొలి తెలుగు సినిమా. 2024లో అంతిమ తీర్పు, దక్షిణ అనే మరో రెండు తెలుగు సినిమాల్లో నటించింది.