
పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ మొదలయ్యాక.. హీరోలకు భాషతో పనిలేకుండా పోయింది. అందుకే దర్శకులు కూడా అన్ని ఇండస్ట్రీల హీరోలతో పని చేస్తున్నారు. వెంకీ అట్లూరి అయితే ఈ మధ్య తెలుగు హీరోల కంటే ఎక్కువగా పరాయి భాషల్లోని హీరోలతోనే పని చేస్తున్నారు. ధనుష్‌తో సార్.. దుల్కర్ సల్మాన్‌తో లక్కీ భాస్కర్ చేసి బ్లాక్‌బస్టర్ కొట్టారు వెంకీ.

వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు వెంకీ అట్లూరి. ఆ తర్వాత అఖిల్‌తో చేసిన మిస్టర్ మజ్ను, నితిన్‌తో చేసిన రంగ్ దే కూడా ప్రేమకథలే.. కాకపోతే వర్కవుట్ కాలేదు.

దాంతో సార్‌తో తనను తాను కొత్తగా పరిచయం చేసుకున్నారు వెంకీ. ఇక లక్కీ భాస్కర్‌తో ఈ దర్శకుడి రేంజ్ మరింత పెరిగిపోయింది. ఈ సినిమా స్టోరీకి, దుల్కర్ నటనకి ఫిదా అయిపోయారు ప్రేక్షకులు.

ధనుష్‌తో హానెస్ట్ రాజ్ అనే సినిమాను ప్లాన్ చేస్తున్నారు వెంకీ అట్లూరి. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లోనే ఈ సినిమా రానుంది. మోక్షజ్ఞ రెండో సినిమాకు వెంకీనే దర్శకుడైనా.. దీనికింకా టైమ్ ఉంది.

ఈ లోపు ధనుష్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. మొత్తానికి వెంకీ కథలు మన హీరోలకు నచ్చట్లేదో లేదంటే ఆయనే చెప్పట్లేదో తెలియట్లేదు కానీ అన్నీ పక్క ఇండస్ట్రీ హీరోల దగ్గరికి వెళ్లిపోతున్నాయి.