దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లోనే అత్యంత ప్రత్యేక స్థానం ఉన్న సినిమా అల్లూరి సీతారామరాజు. భారత స్వాతంత్రోద్యమంలో విప్లవ జ్యోతిగా వెలిగి.. దేశం కోసం ప్రాణాలను లెక్కచేయని అల్లూరి సీతారామరాజు జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు కృష్ణ.
ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సినిమాను నిర్మించారు. 1957 జనవరి 17న పాటల రికార్డింగ్‌తో విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు సినిమాకు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. కానీ అప్పటి నుంచి ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. చివరకు సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాను పూర్తి చేశారు.
1973లో అల్లూరి సీతారామరాజు కథను కృష్ణ తెరకెక్కిస్తున్నారని వార్త అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యింది. ఆయన సాహసానికి యావత్ సినీ పరిశ్రమ నివ్వెర పోయింది. ఈ సినిమాను నిర్మించాలని ఎన్టీఆర్, శోభన్ బాబు కూడా ప్రయత్నించి చేయలేకపోయారు.
అల్లూరి సీతారామరాజు సినిమా పే చెయ్యదు అని.. దేవుడు చేసిన మనుషులు సినిమాతో వచ్చిన డబ్బు పోగొట్టుకుంటారని.. దానికి బదులు కురుక్షేత్రం సినిమా తీయాలని సలహా ఇచ్చారు. కానీ కృష్ణ ఒప్పుకోలేదు. ఒకవేళ ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానని చెబితే వదిలేస్తానని అన్నారు కృష్ణ.
అప్పట్లో అల్లూరి సీతారామరాజు టైటిల్ కోసం చాలా గొడవే జరిగింది. ఈ సినిమాలో ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, నాగభూషణం తప్ప ఇండస్ట్రీలోని నటీనటులు అందరూ నటించారు.
ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్ని.. అనేక ఒడిదుడుకులను అధిగమించి ఈ సినిమాను పూర్తి చేశారు. 1974 మే1న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సీతారామరాజు పాత్రలో కృష్ణ అద్భుతమైన నటనకు జనం జేజేలు పలికారు. 19 కేంద్రాల్లో వంద రోజులు, రెండు కేంద్రాల్లో 25 వారాలు ఈ సినిమా అడింది.
1975 మే 1న మద్రాసులోని వుడ్ ల్యాండ్ హోటల్లో జరిగిన స్వర్ణోత్సవానికి శోభన్ బాబు, హిందీ నటి హేమమాలిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమా విడుదలై నేటికి 50 ఏళ్లు పూర్తయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి నేటికి 50 ఏళ్లు గడిచాయి.