పెద్దల మాట చద్దిమూట అని ఊరికే అంటారు పెద్దలు.. ఇప్పుడు శ్రీలీల కూడా ఇదే చేస్తున్నారు. లేనిపోని రిస్కులు తీసుకోకుండా హాయిగా తన సీనియర్స్ చూపించిన బాటలోనే నడుస్తున్నారు ఈ బ్యూటీ. తెలుగులో కొత్తగా ఛాన్సులు రావట్లేదు.. అలాగని ఊరికే కూర్చుంటామా చెప్పండి.. అందుకే బ్యాగ్ సర్దేసి ఇండస్ట్రీ మార్చేస్తున్నారు ఈ బ్యూటీ.
మరి శ్రీలీల దారెటు..? గతేడాది మొత్తం శ్రీలీల జపమే నడిచింది ఇండస్ట్రీలో. ముఖ్యంగా 2024 సెకండాఫ్‌లో అయితే నెలకో సినిమాలో కనిపించారు ఈ బ్యూటీ. స్కంద, ఆదికేశవ, భగవంత్ కేసరి, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం ఇవన్నీ కేవలం 5 నెలల గ్యాప్‌లోనే విడుదలయ్యాయి.
గుంటూరు కారం తర్వాతే శ్రీలీల పూర్తిగా ఖాళీ అయిపోయారు. తెలుగులో ఇప్పట్లో అవకాశాలు వచ్చేలా కనిపించడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ సినిమాలు మొదలవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. అందుకే తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నారు శ్రీలీల.
తాజాగా ఓ కాలేజ్ ఈవెంట్ కోసం తమిళనాడు వెళ్లిన ఈ బ్యూటీకి అక్కడ్నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దాంతో తమిళంలో నటించాలని ఉందని మనసులో మాట చెప్పారు శ్రీలీల. గతంలోనూ కొందరు హీరోయిన్లు ఇదే చేసారు.
తెలుగులో ఛాన్సుల్లేని సమయంలోనే.. తమన్నా, హన్సిక, అంజలి లాంటి బ్యూటీస్ కోలీవుడ్‌కు వెళ్లి అక్కడ ఏలేసారు. అంతెందుకు తాజాగా కృతి శెట్టికి తమిళంలో ఆఫర్స్ బానే వస్తున్నాయి. ఇప్పుడు శ్రీలీల ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి ఈ భామను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆ దర్శకుడెవరో చూడాలి..!