
గేమ్ చేంజర్‌కి సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు రామ్‌చరణ్ అభిమానులు. చెర్రీ పుట్టినరోజును పురస్కరించుకుని మార్చి 27న ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. అందుకోసం నెల రోజుల కౌంట్‌డౌన్ కూడా మొదలుపెట్టేశారు. ఏదో ఒక డేట్‌కి కమిట్ అవ్వకపోతే టార్గెట్ రీచ్ కావడం కష్టమన్నది ఫ్యాన్స్ ఫీలింగ్.

అందుకే చెర్రీ పుట్టినరోజున శంకర్ కచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. చరణ్, కియారా జంటగా నటిస్తున్న గేమ్‌చేంజర్‌ని దసరాకి రిలీజ్ చేస్తారా? దీపావళికి థియేటర్లలోకి తీసుకొస్తారా? అనే విషయాన్ని చెప్పమని కోరుతున్నారు. మరి శంకర్ ఈ కౌంట్‌డౌన్‌ని పట్టించుకుంటారా?

వరుణ్‌తేజ్, పల్లవి జోడీ అనగానే ఫిదా మూవీ గుర్తుకొస్తుంది. నిజామాబాద్ పరిసరాల్లో అచ్చమైన తెలంగాణలో మాట్లాడిన సాయిపల్లవి గడుసుతనం గుర్తుకొస్తుంది. ట్రేడ్ పండిట్స్ కి లాభాలు తెచ్చిపెట్టిన ప్రాజెక్ట్ మనసులో మెదులుతుంది. మూవీ లవర్స్ కి మంచి ఫీల్‌గుడ్ కంటెంట్ ఉన్న సినిమా అనిపిస్తుంది. మరి అందరి మనసుల్లోనూ ఇంత మంచిగా ముద్ర వేసుకున్న ఫిదా జోడీ మళ్లీ స్క్రీన్ మీద ఎందుకు కలిసి కనిపించలేదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చేశారు వరుణ్. ఈ జోడీ దగ్గరికి ఓ ప్రాజెక్ట్ వెళ్లిందట. అయితే ఇద్దరూ దాన్ని రిజక్ట్ చేశారట. ఫిదా క్రేజ్‌ని క్యాష్ చేసుకోకూడదని అనుకున్నారట. ఫిదాని మరిపించే కథ వస్తేనే, కలిసి సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట వరుణ్ - పల్లవి.

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నది మన పెద్దలు ఎప్పుడూ చెప్పేమాట. ఇప్పుడు ప్రభాస్ కూడా అలా పోగొట్టుకున్న విషయాలను వెతుక్కునే పనిలోనే ఉన్నారు. ఇంతకీ ఏం పోగొట్టుకున్నారు? ఏం వెతుకుతున్నారు? అని అంటారా? రామాయణంతో పోగొట్టుకున్న పేరును, భారతంతో సంపాదించుకోవాలన్నదే ప్రభాస్ తాపత్రయం.

డార్లింగ్ లేటెస్ట్ సినిమా కల్కిలో భారతం ప్రస్తావన ఉంటుంది. 2898 ఏడీ వరకు సాగే అంశాలతో ఈ సినిమా ఉంటుంది. ఆల్రెడీ రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ ప్రభాస్ కెరీర్లో డిజాస్టర్‌గా మిగిలింది. ఇప్పుడు భారతంతో మొదలయ్యే కల్కి అయినా కలిసొస్తుందో, లేదో అనే టెన్షన్ కనిపిస్తోంది డార్లింగ్ సైన్యంలో.