
ఆవు పులి కథలా మారిపోయింది గేమ్ ఛేంజర్ సినిమా పరిస్థితి. ఆశగా ఎదురు చూడటం.. చివరాఖరికి సారీ చెప్పడం.. ఫ్యాన్స్‌ను నిరాశ పరచడం అనేది కామన్ అయిపోయింది గేమ్ ఛేంజర్ మేకర్స్‌కు. మరోసారి అదే జరిగింది. దివాళికి వస్తుందనుకున్న పాటను వాయిదా వేసారు దర్శక నిర్మాతలు. ఈ సారి ఏం జరిగింది..? అసలెందుకు ఈ పాట ఇంతగా ఆలస్యమవుతుంది..?

అదేంటో కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు ఏదీ సరిగ్గా కలిసిరావడం లేదు. షూటింగ్ సవ్యంగా సాగుతుందా అంటే ఇండియన్ 2 కారణంగా దర్శకుడు శంకర్ దీనిపై తక్కువగానే ఫోకస్ చేస్తున్నారు.

అప్పుడప్పుడూ వచ్చి షూట్ చేస్తున్నారు. పోనీ దీపావళికి పాట విడుదల చేస్తారేమో అనుకుంటే.. అదీ లేదు. తాజాగా జరగండి పాటను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

నిజానికి దివాళి కంటే ముందే గేమ్ ఛేంజర్ సాంగ్ విడుదల చేస్తామని చెప్పారు దర్శక నిర్మాతలు. కానీ పండక్కి చూసుకుందాం అంటూ పోస్టర్ విడుదల చేసారు. తీరా చూస్తే.. ఇప్పుడు అది కూడా లేదు. డాక్యుమెంటేషన్ ఫెయిల్యూర్ కారణంగా ఈ పాట వాయిదా వేస్తున్నట్లు తెలిపారు మేకర్స్. సారేగమా కంపెనీ గేమ్ ఛేంజర్ ఆడియో రైట్స్ తీసుకున్నారు.

దివాళి హాలీడేస్ కారణంగా అత్యవసరమైన కొన్ని డాక్యుమెంట్స్ ఇంకా ఆడియో కంపెనీకి సబ్‌మిట్ చేయలేదు మేకర్స్. దాంతో పండగ తర్వాతే పాట విడుదల కానుంది. కచ్చితంగా మీ వెయిటింగ్‌కు తగిన ఫలితం దక్కుతుందని.. పాట అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేసారు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్. ఏదేమైనా దివాళికి పాట విందాం అనుకున్న చరణ్ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశ అయితే తప్పలేదు.