
ప్రభాస్ ఇప్పుడు సూపర్ యాక్టివ్ మోడ్‌లో ఉన్నారు. ఆయన నటిస్తున్న రాజా సాబ్ షూటింగ్ అజీజ్‌నగర్‌లో, ఫౌజీ షూటింగ్ అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. మరి డార్లింగ్ ఆన్ అండ్ ఆఫ్‌గా రెండు సెట్లనూ కవర్ చేస్తున్నారా? లేకుంటే, ఆయన లేని పోర్షన్ ఓ చోట, ఆయనున్న సీన్స్‌తో మరోచోట కానిచ్చేస్తున్నారా? అనేది ఫ్యాన్స్‌కి ఆసక్తికరంగా మారింది.

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ ఏడాది మెగా హిట్ విశ్వంభరతో పక్కా అనే క్లారిటీ వాళ్లది. ఈ సినిమా షూటింగ్ కోకాపేటలో బుధవారం నుంచి జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్‌తో స్టెప్పులేయిస్తున్నారు వశిష్ట.

మొన్నటిదాకా ముచ్చింతల్‌లో జరిగిన అఖండ2 షూటింగ్ ప్రస్తుతం ఏడెకరాలలో జరుగుతోంది. అఖండ తాండవం పేరుతో ఈ శివరాత్రికి అప్‌డేట్ ఇస్తారన్నది ఫ్యాన్స్ ఆశ. బాలయ్య బోయపాటి కాంబోలో నాలుగవ చిత్రమిది.

బాలయ్య వెళ్లొచ్చిన ముచ్చింతల్‌కి ఇప్పుడు పవన్ కల్యాణ్ ట్రావెల్ చేస్తున్నారు. హరిహరవీరమల్లు షూటింగ్ ఆ పరిసరాల్లోనే జరుగుతోంది. నిఖిల్ స్వయంభూ సినిమా షూటింగ్ మాత్రం జానవాడలో జరుగుతుంది.

నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కడే అల్లరి నరేష్ మూవీ పనులు కూడా స్పీడందుకున్నాయి. సాయి దుర్గ తేజ్ హీరోగా హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా షూట్ తుక్కుగూడకి షిఫ్ట్ అయింది.