
జరగండి, రా మచ్చ సాంగ్స్ విషయంలో ముందు నెగెటివ్ కామెంట్స్ వినిపించినా... ఫైనల్‌గా సూపర్ హిట్ అయ్యాయి. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో సత్తా చాటుతున్నాయి. దీంతో సినిమా మీద కూడా అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

రన్ రాజా రన్.. మన హీరోల పరిస్థితి ఇలాగే ఉందిప్పుడు. ఎందుకంటే రిలీజ్ డేట్స్ దగ్గరికి వచ్చేస్తుంటే.. మిగిలిన షూటింగ్ కలవరపెడుతుంటే.. ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు పాపం. ఒక్క అల్లు అర్జునో.. ఎన్టీఆరో కాదు.. రామ్ చరణ్ కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారిప్పుడు. ఈ ముగ్గురి సినిమాలకు మెడ మీద కత్తి వేలాడుతుందిప్పుడు. నమ్మడం కష్టమే కానీ జరుగుతున్నదిదే.

కావాలంటే జూనియర్ ఎన్టీఆర్‌నే తీసుకుందాం..! సోలో హీరోగా నటించిన అరవింద సమేత వచ్చి ఆరేళ్లు దాటింది.. చరణ్‌తో నటించిన ట్రిపుల్ ఆర్ వచ్చి రెండేళ్లైపోయింది. దాంతో ఫ్యాన్స్‌కు భారీగా బాకీ పడిపోయారు తారక్. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికే దేవరతో పాటు వార్ 2 ఒకేసారి పూర్తి చేస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర విడుదల కానుంది.. కానీ ఇప్పటికీ ప్రమోషన్స్ మొదలు కాలేదు.

200 కోట్లతో దేవర పార్ట్ 1 తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. కొన్ని సీన్స్, ఓ పాట చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇవి త్వరగానే పూర్తవుతాయి కానీ ప్రమోషన్స్‌కు టైమ్ సరిపోతుందా అనే అనుమానాలు లేకపోలేదు. దీనికంటే 2 వారాలు తర్వాత వస్తున్న సూర్య కంగువా ప్రమోషన్ అప్పుడే మొదలైపోయింది. అక్టోబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది.

పుష్ప 2కు కూడా ఇలాంటి పరిస్థితే. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.. డిసెంబర్ 6న కష్టమే అనే ప్రచారం.. నెమ్మదిగా సాగే ప్రమోషన్.. అన్నింటితోనూ పోరాడుతున్నాడు పుష్ప రాజ్. ఇక గేమ్ ఛేంజర్ పరిస్థితి మరీ విచిత్రం. క్రిస్మస్‌కు వస్తుందంటున్నారు కానీ ఇంకా చాలా పనులు పెండింగ్ ఉండిపోయాయి. ఆగస్ట్‌లో రెండో పాట రానుంది. మొత్తానికి ఈ సినిమాలన్నీ వచ్చేవరకు మెడపై కత్తి వేలాడుతూనే ఉంది.