
అదేంటో కానీ గుంటూరు కారం మొదలు పెట్టిన రోజు నుంచి కూడా ఈ చిత్రంపై ఏదో ఓ రూమర్ వస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు మేకర్స్ వాటిపై క్లారిటీ ఇస్తున్నా కూడా కొత్త కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై మరో న్యూస్ వైరల్ అవుతుంది. అందుకే వాళ్లు వీళ్లు కాదు.. ఏకంగా నిర్మాతే బయటికి వచ్చేసాడు. అసలు నిజం చెప్పేసాడు. అసలేంటి ఆ నిజం.. ఇంతకీ వచ్చిన ఆ వార్తేంటి..?

కొన్ని నెలలుగా నాన్ స్టాప్ షూటింగ్‌తో అల్లాడిస్తున్నారు గుంటూరు కారం టీం. జనవరి 12 ఇంకా ఎంతో దూరంలో లేదు కాబట్టి దానికి తగ్గట్లుగానే షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసాకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫారెన్ వెళ్లనున్నారు సూపర్ స్టార్. దీనికి తగ్గట్లుగానే ఓ పాట మినహా షూటింగ్ అంతా పూర్తి చేసారు త్రివిక్రమ్. ఇక్కడే అసలు రూమర్స్ మొదలయ్యాయి.

రిలీజ్‌కు మరో 20 రోజులు మాత్రమే ఉండటంతో పనుల్లో వేగం పెంచేసారు మేకర్స్. మిగిలిన ఒక్క పాటను స్టార్ హీరోయిన్‌తో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు గుంటూరు కారం టీం. ఇప్పటికే పూజా హెగ్డేతో పాటు రాశీ ఖన్నాను కూడా అడిగినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పాట అసలు ఉండదని.. లాస్ట్ సాంగ్ లేకుండానే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పారనే వార్తలు మొదలయ్యాయి.

గుంటూరు కారంపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టడానికి ఏకంగా నిర్మాత నాగవంశీ వచ్చారు. అవన్నీ పుకార్లేనని.. డిసెంబర్ 21 నుంచి చివరి పాట చిత్రీకరణ మొదలవుతుందని తేల్చేసారు. గతంలోనూ సినిమాపై ఎలాంటి రూమర్ వచ్చినా నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడూ ఇదే చేస్తున్నారు ఈ నిర్మాత. బయట బోలెడు వార్తలు వస్తుంటాయి.. అవేం నమ్మొద్దంటూ అభిమానులకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు నాగవంశీ.

సర్కారు వారి పాట వచ్చి ఇప్పటికే ఏడాదిన్నర దాటింది.. పైగా గుంటూరు కారం తర్వాత రాజమౌళి కారణంగా మరో రెండు మూడేళ్లు మహేష్ సినిమా రాకపోవచ్చు. అందుకే ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సూపర్ స్టార్. జనవరి 12న కచ్చితంగా బాక్సాఫీస్ బద్దలైపోవాల్సిందే అంటున్నారు బాబు. గతంలో ఒక్కడు, బిజినెస్ మేన్, సీతమ్మ వాకిట్లో, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలన్నీ సంక్రాంతికే వచ్చాయి.