
ఎట్టకేలకు రూమర్సే నిజమయ్యాయి. గత కొంతకాలంగా ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టిన వార్తలు ఇప్పుడు నిజమని తెలిసిపోయింది. ముందు నుంచి వినిపిస్తున్నట్లు హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొణిదెల వారి ఇంటి కోడలు కాబోతుంది.

ఇన్నాళ్లు ప్రేమలో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం తేదీని సైతం ఫిక్స్ చేశారు కుటుంబసభ్యులు.

వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్ లో జరగనుంది. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంతమంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

లావణ్య త్రిపాఠి 1990 డిసెంబరు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించింది. తండ్రి లాయర్ కావడంతో వృత్తి జీవితం కోసం కుటుంబమంతా ఉత్తరాఖండ్‌కు వెళ్లింది. దీంతో లావణ్య బాల్యమంతా అక్కడే గడిచింది.

ఆ తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం ముంబయి వెళ్లిన లావణ్య రిషి దయారామ్ నేషనల్ కాలేజ్‌లో ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నెమ్మదిగా మోడలింగ్‌పై ఆసక్తి ఏర్పడటంతో అటువైపు అడుగులు వేసింది. పలు వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్ షోలలో నటించింది. 2006లో మిస్ ఉత్తరాఖండ్‌గా ఎంపికైంది.

2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’ చిత్రంలో మిథునగా అమాయకపు అమ్మాయిగా తన నటనతో అలరించింది.

ఆ తర్వాత ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ఇలా వరుస చిత్రాల్లో నటించింది. గతేడాది ఆమె నటించిన ‘అర్జున్ సురవరం’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఇక గత కొంతకాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తుంది లావణ్య. ఆమె చివరిసారిగా హ్యాపీ బర్త్ డే చిత్రంలో కనిపించింది. ఇక ఇటీవలే పులి మేక అనే వెబ్ సిరీస్ లో నటించింది.

ఇక ఇప్పుడు కొణిదెల వారి ఇంటి కోడలు కాబోతుంది. వరుణ్ తేజ్ సరసన మిస్టర్ సినిమాలో నటించింది లావణ్య. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని.. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు ఫిల్మ్ సర్కిల్లో వైరలయ్యాయి.

కొణిదెల వారి ఇంటి కోడలు కాబోతున్న 'అందాల రాక్షసి'.. లావణ్య త్రిపాఠి గురించి ఆసక్తికర విషయాలు..