కలిసి ఫొటోలు తీసుకుంటే తప్పా చెప్పండి? ఒక్క ఫ్రేమ్‌లో కలిసున్న వాళ్లు జీవితాంతం కలిసి ఉంటే బావుంటుందని కొందరు కోరుకోవచ్చు. కోరిక వేరు.. నిజం వేరు. ఆ విషయాన్ని గుర్తించాలి.. ఇంతకీ మీరేమంటారూ... నిజమే, నిజమే అంటారా? అయితే మీరు కూడా మహానటి ఫాదర్‌తో మాట కలిపినట్టే మరి... డీటైల్డ్ గా మాట్లాడేసుకుందాం రండి...
కీర్తీ సురేష్‌కి ఇప్పుడు బ్రెడ్‌కి బటర్ పూసుకుని తినే తీరిక కూడా లేదట. నార్త్ ఎంట్రీ ఇవ్వాలంటే మాటలా మరి. ఉత్తరాది వాళ్లకు తగ్గట్టు అన్నీ మార్చుకోవాలి. స్టైలింగ్ మారాలి, యాక్టింగ్ మారాలి. కేరక్టర్ డిమాండ్ మేరకు ఫిజిక్ మారాలి... ఎన్నేసి మార్పులో కదా.. యస్.. అందుకే, అన్నీ విధాలా మారుతూ బిజీగా ఉన్నారు మహానటి.
ఆ మధ్య మనమే చెప్పుకున్నట్టు... సినిమాల్లో కాసింత వార్తల ఫ్లో తగ్గిన ప్రతిసారీ కీర్తీ సురేష్ పెళ్లి టాపిక్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ మధ్య శివకార్తికేయన్‌తో కీర్తీ సురేష్ రిలేషన్‌లో ఉన్నారని వార్తలొచ్చాయి.
వాళ్లిద్దరూ కలిసి సినిమాలు చేసినంత మాత్రాన అలా రాయడం తప్పు, శివకార్తికేయన్‌కి ఆల్రెడీ పెళ్లయిపోయింది. అసలు అలాంటి పిచ్చి ఊహలు ఎలా చేస్తారని కసురు కున్నారు కీర్తీ ఫాదర్ సురేష్. ఇంకోసారి ఫర్హాన్ అనే కుర్రాడితో కీర్తీ ప్రేమాయణం అనే వార్తలు వైరల్ అయినప్పుడు కూడా ఆయన అలాగే మండిపడ్డారు.
లేటెస్ట్ గా మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్‌తో కీర్తీసురేష్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కీర్తీ సురేష్ ఎప్పుడూ ఏదో ఒక మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్‌తో కనిపిస్తారని, అదంతా అనిరుద్ పరిచయం వల్లనేననే వార్తలూ వచ్చాయి. వారిద్దరున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అనిరుద్ ఆమెకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు ఆమె ఫాదర్. అంతేకాదు, కీర్తి పెళ్లి గురించి తామే అందరికీ అనౌన్స్ చేస్తామని, నోటికొచ్చినట్టు రాయొద్దని కూడా వేడుకున్నారు. ఇప్పటికైనా మహానటి పెళ్లి వార్తలు ఆగుతాయా?