
చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది.

తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలోనే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. వీరికి బాబు నీల్ కిచ్లూ జన్మించిన సంగతి తెలిసిందే. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తుంది కాజల్.

ప్రస్తుతం కాజల్ నటించిన సత్యభామ సినిమా మే 31న రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది కాజల్. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందులు, సంఘటనలను గుర్తు చేసుకుంది.

కొన్నాళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నానని.. తొలిరోజు షూటింగ్ కంప్లీట్ కాగానే ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ తన అనుమతి లేకుండానే తన వ్యానిటీ వ్యాన్ లోకి వచ్చాడని తెలిపింది. చొక్క విప్పి.. తన ఛాతీపై ఉన్న తన పేరును టాటూని చూపిస్తూ తనకు పెద్ద అభిమానని చెప్పాడని గుర్తుచేసుకుంది.

ఎవరు లేని సమయంలో అతడు అలా చేయడంతో తాను భయపడ్డానని.. అభిమానాన్ని పచ్చబొట్టు రూపంలో చూపించినందుకు ఆనందంగా ఉన్నా.. అలా చేయడం కరెక్ట్ కాదని సున్నితంగా హెచ్చరించి పంపించినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సత్యభామ సినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా.. నవీన్ చంద్ర కీలకపాత్ర పోషించాడు.