కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న జేడీ చక్రవర్తి ఇప్పుడు ఓటీటీల బాట పట్టాడు. అతను నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ దయా. తెలుగమ్మాయి ఇషా రెబ్బా, యాంకర్ విష్ణుప్రియ, రమ్యనంబీసన్, జోష్ రవి, కమల్ కామరాజు తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషించారు.
గతంలో సావిత్రి, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలతో పాటు రాజేంద్ర ప్రసాద్‌తో సేనాపతి వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించిన పవన్ సాధినేని దయా సిరీస్‌కు దర్శకత్వం వహించారు.
టీజర్లు, గ్లింప్స్, ట్రైలర్లు ఆసక్తిగా ఉండడం, దీనికి తోడు సినిమా స్థాయిలో విస్తృతంగా ప్రమోషన్లు చేయడంతో దయాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. దీంతో ఓటీటీ ఆడియెన్స్ ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.
ఈ నిరీక్షణకు తెరదించుతూ శుక్రవారం (ఆగస్టు 4) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో దయా సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగుతో పాటు మరో ఆరు భాషల్లోనూ దయా సీజన్-1 అందుబాటులోకి వచ్చింది.
దయా సిరీస్లో జేడీ చక్రవర్తి వ్యాన్ డ్రైవర్‌గా నటించాడు. కాగా ఈ సిరీస్‌కు కొనసాగింపు కూడా ఉండనుంది. అందుకు తగ్గట్టుగానే సీజన్ 1 ఎపిసోడ్‌లో హింట్ కూడా ఇచ్చేశారు మేకర్స్.