
సూపర్ స్టార్ రజినీకాంత్ తన కొత్త మువీ జైలర్ సినిమా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ కలిసి వీక్షించేందుకు గత శనివారం లక్నోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్న ఆయన లక్నోలోని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసంలో కలవడం జరిగింది.

ఈ సందర్భంగా కారు దిగి నేరుగా లోపలికి వెళ్లిన రజినీకి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ఎదురు రాగా.. వెంటనే వంగి ఆయన కాళ్లకు రజినీ నమస్కరించారు. సీఎం యోగి వారిస్తున్నా రజినీ ఆయన ఆశీర్వాదం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తమిళ సినీ అభిమానులలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. వయసులో దాదాపు 20 ఏళ్లు చిన్నవాడైన ముఖ్యమంత్రి కాళ్లపై పడటం ఏంటని నెటిజన్స్ గత కొన్ని రోజులుగా ట్రోల్స్ చేస్తున్నారు.

అభిమానులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా రజినీ చర్యను తప్పుపట్టారు. ఐతే రజినీ మాత్రం తనపై వస్తున్న విమర్శలపై ఇప్పటి వరకు పెదవి విప్పింది లేదు.

తాజాగా ఆయన తన పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో మీడియా కంటపడ్డారు. అంటే సూటిగా యుపి సిఎం పాదాలను తాకడంపై వచ్చిన వివాదంపై తన స్పందన ఏమిటని ప్రశ్నించారు. యోగులు లేదా సన్యాసులు పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటు. వారు నాకంటే చిన్నవారైనా సరే.. అది నా పద్ధతి' తన సంస్కారాన్ని ఒక్కమాటలో బయటపెట్టారు.

దీంతో విమర్శించిన నోళ్లన్నీ ఒక్కసారిగా మూతపడిపోయాయ్! తలైవా చెప్పిన దాంట్లో వెతకాల్సిన తప్పు ఎవరికీ కనిపించకపోవడంతో విమర్శలకు తెరపడినట్లైంది. తనపై వస్తున్న విమర్శలపై రజినీ కాంత్ తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.