
రామకథతో ఫెయిల్ అయిన తమ అభిమాన హీరో కల్కితో గట్టెక్కాలని కోరుకుంటోంది రెబల్ సైన్యం. పౌరాణిక పాత్రలను అటెంప్ట్ చేయడం మామూలు విషయం కాదు. అందులోనూ భారతకాలం నుంచి మోడ్రన్ టైమ్ వరకు సాగే ఈ కథలో డార్లింగ్ రోల్‌ని నాగ్ అశ్విన్ ఎలా తీర్చిదిద్దారు.?

కలిసొచ్చిన తేదీ.. కలెక్షన్లు కురిపించిన తేదీ అంటూ మే 9న కల్కిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు మేకర్స్. అయితే ఓ వైపు ఎన్నికలు, ఇంకోవైపు క్రికెట్ హడావిడి... ఇన్నిటి మధ్య సినిమాను విడుదల చేయడం అవసరమా అని వాయిదా వేస్తున్నారన్నది వినిపిస్తున్న మాట. అయితే కల్కికి సంబంధించి అంతకు మించి మరో విషయం ఇండస్ట్రీలో గుప్పుమంటోంది.

కల్కిలో అశ్వత్థామ వీడియో చూసినప్పటి నుంచీ ఎవరి యాంగిల్‌లో వాళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు. వారెవా... ఇంత టెక్నాలజీని ఎప్పుడూ చూడలేదు.. టెక్నికల్‌గా మూవీ వేరే లెవల్‌లో ఉంటుంది అని అమితాబ్‌లాంటి స్టాల్‌వార్ట్స్ మెచ్చుకుంటున్నారు. అందులో అసలు మేకింగ్ ఏముంది? అని నార్త్ జనాలు కొందరు పెదవి విరవడాన్ని చూస్తున్నాం.

అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి అవన్నీ పట్టడం లేదు. తమకు కావాల్సిన కొత్త యాంగిల్‌ని వెతుక్కుంటూ సాధ్యాసాధ్యాల గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటది.? ప్రభాస్ కెరీర్‌లో మాయని మచ్చలా మిగిలిపోయింది ఆదిపురుష్.

శ్రీరామచంద్రమూర్తిగా ప్రభాస్ నటించిన ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో బాగా తడబడింది. ప్రజలందరికీ తెలిసిన రామకథను చక్కగా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు ఓమ్ రవుత్. ఇప్పుడు కల్కిలో అమితాబ్ కేరక్టర్ రివీల్ చేసిన ఈ టైమ్‌లో మరోసారి ఆదిపురుష్‌ని గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్.