
రవితేజ రాంగ్ టైమింగ్‌లో వస్తున్నారా..? కోరికోరి మరీ కష్టాలు కొని తెచ్చుకుంటున్నారా..? ఆయన పాన్ ఇండియన్ సినిమాకు ముహూర్తం కరెక్టుగా లేదా..? టైగర్ నాగేశ్వరరావు అటాక్‌కు అక్టోబర్ 20 ఎంతవరకు సరైంది..? అదే రోజు తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ చాలా సినిమాలు వస్తున్నాయి. మరి వాటి ప్రభావం టైగర్‌పై ఎంత ఉండబోతుంది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

టైగర్ నాగేశ్వరరావుతో పాన్ ఇండియన్ హిట్ కొట్టాలని కసితో ఉన్నారు రవితేజ. దానికోసమే పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు మాస్ రాజా. ఎప్పుడూ లేనిది ముంబై వెళ్లి అక్కడ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ట్రైలర్ లాంఛ్ కోసమే భారీ ఈవెంట్ ఏర్పాటు చేసారు. అక్టోబర్ 20న భారీ అంచనాల మధ్య విడుదల కానుంది టైగర్ నాగేశ్వరరావు.

పాన్ ఇండియన్ ప్రమోషన్ వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలోనే అసలు కన్ఫ్యూజన్ మొదలైందిప్పుడు. ఎందుకంటే అదే రోజు మిగిలిన భాషల్లోనూ భారీ సినిమాలు విడుదల కానున్నాయి. తెలుగు వరకు అయితే రవితేజ సినిమాకు ఏ ఇబ్బంది లేదు.. ఇక్కడ థియేటర్స్ సమస్య కూడా రాదు.. కానీ తమిళ, హిందీలో అలా కాదు కదా..!

అక్టోబర్ 19న తమిళంలో లియో విడుదల కానుంది. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అంతా లియో కావాలని ఎగబడుతున్నారు. విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు. తెలుగులోనూ ఈ సినిమాను భారీగానే విడుదల చేస్తున్నారు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు ఉన్నా.. తెలుగులో మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి.

లియో కారణంగా టైగర్ నాగేశ్వరరావుకు తమిళంలో మంచి డిస్ట్రిబ్యూషన్ సంస్థల సపోర్ట్ లభించడం లేదు. మరోవైపు హిందీలోనూ అక్టోబర్ 20న టైగర్ ష్రాఫ్ నటిస్తున్న గణపథ్ విడుదల కానుంది. థియేటర్స్‌లో మేజర్ షేర్ ఈ సినిమాకు వెళ్తాయి. దాంతో రవితేజ సినిమాకు ఊహించిన థియేటర్స్ అయితే రావు. కన్నడ, మలయాళంలోనూ లియో దూకుడు కనిపిస్తుంది. వీటన్నింటినీ అధిగమించి టైగర్ అటాక్ ఎలా ఉండబోతుందో చూడాలిక.