
ఇళయరాజా.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఈయన పాట ఎంత హాయిగా ఉంటుందో.. ఈయన తీరు అంత కఠినంగా ఉంటుంది. తన పాటను ఎవరైనా అనుమతి లేకుండా వాడుకుంటే చుక్కలు చూపిస్తారు మ్యాస్ట్రో.

గతేడాది మంజుమ్మెల్ బాయ్స్ టీంకు ఇది బాగా ఎక్స్‌పీరియన్స్ అయింది. గుణ సినిమా పాట వాడుకున్నందుకు పెనాల్టీ వేసారీయన. అనుమతి లేకుండా తన పాటలు వాడుకుంటే అస్సలు సహించరు ఇళయరాజా.

తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ టీంకు షాకిచ్చారు. పర్మిషన్ లేకుండా తను స్వరపరిచిన ఒత్తరుబా తారెన్, ఎన్‌జోడి మంజకురివి, ఇలమై ఇదో అనే పాటలను సినిమాలో వాడుకున్నారని.. దీనికి ప్రతిఫలంగా తనకు 5 కోట్లు ఇవ్వడమే కాకుండా.. వారంలోపు క్షమాపణ చెప్పాలంటూ మైత్రి మూవీ మేకర్స్‌కు లీగల్ నోటీసులు పంపించారు మ్యాస్ట్రో.

ఇళయరాజా నోటీసులపై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా స్పందించారు. తాము ఆడియో కంపెనీల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాకే పాటలు వాడుకున్నామని.. ఆ పాటలపై పూర్తి హక్కులు వాళ్లకు మాత్రమే ఉంటాయన్నారు తెలిపారు మైత్రి రవిశంకర్. ఈ మధ్యే రజినీకాంత్ కూలీ సినిమా యూనిట్‌కు కూడా లీగల్ షాక్ ఇచ్చారు రాజా.

ఇళయరాజా తీరుపై విమర్శలు కూడా భారీగానే వస్తున్నాయి. ఎందుకీయన ఇలా చేస్తున్నారు.. ఆడియో కంపెనీ నుంచి అనుమతులు తీసుకుని పాటలు వాడుకుంటే తప్పేంటి అంటున్నారు. గతంలో ప్రాణమిత్రుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కూడా నోటీసులు పంపి సంచలనం సృష్టించారు మ్యాస్ట్రో. మొత్తానికి ఇళయరాజా తీరు అందరికీ షాకిస్తుందిప్పుడు.