
దాదాపు 20 ఏళ్ళ కింద ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఛత్రపతి గుర్తుందా..? అందులో హీరో నేపథ్యం శ్రీలంక.. అక్కడ్నుంచి శరణార్థులుగా ఇండియాకు వస్తారు.. వచ్చిన తర్వాత ఓ వాడలో హీరో ఎలా నాయకుడిగా ఎదిగాడు అనేది ఛత్రపతి కథ.

తెలుగు సినిమాకు శ్రీలంక నేపథ్యం అప్పుడు బాగా కలిసొచ్చింది.. ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్‌లోనూ లంక బ్యాక్‌డ్రాప్ ఉంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా కింగ్డమ్. ఈ చిత్ర కథ అంతా శ్రీలంక నేపథ్యమే.

ఇది కూడా శరణార్థుల కథే అనిపిస్తుంది టీజర్ చూస్తుంటే..! ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు గౌతమ్. తాజాగా విడుదలైన అన్న పాట చూస్తుంటే ఇందులో ఎమోషన్ రేంజ్ అర్థమవుతుంది.

తెలుగులో మాత్రమే కాదు.. మిగిలిన ఇండస్ట్రీలకు కూడా శ్రీలంక నేపథ్యం బాగానే కలిసొస్తుంది. ఈ మధ్యే తమిళంలో విడుదలై సంచలన విజయం సాధించిన టూరిస్ట్ ఫ్యామిలీలో ఉన్నది లంక నేపథ్యమే. అక్కడ్నుంచి ఓ కుటుంబం అడ్డదారిలో ఇండియాకు వచ్చి.. ఇక్కడెలా సర్వైవ్ అయ్యారు అనేది కథ. 8 కోట్లతో తెరకెక్కి.. 80 కోట్లు వసూలు చేసింది టూరిస్ట్ ఫ్యామిలీ.

వెబ్ సిరీస్‌లలో కూడా లంక నేపథ్యం వర్కవుట్ అయింది. ఆ మధ్య సమంత కీలక పాత్రలో రాజ్ డికే క్రియేట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ 2లో ఉన్నదంతా శ్రీలంక నేపథ్యమే. LTTE నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ సంచలనం సృష్టించింది. రాజీవ్ గాంధీ డెత్ మిస్టరీగా వచ్చిన మొన్నటి హంట్ సిరీస్‌లోనూ లంక బ్యాక్‌డ్రాప్ ఉంది.