
త్రివిక్రమ్ డైరక్షన్‌లో రామ్ హీరోగా సినిమా ఉంటుందా? ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో వైరల్ అవుతున్న విషయాల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం మహేష్‌బాబు గుంటూరు కారం సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్. 2024 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి అహర్నిశలూ కృషి చేస్తున్నారు మేకర్స్. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు కారం నుంచి దమ్ బిరియాని ఫుల్ సాంగ్‌ని రిలీజ్ అయింది.

గురూజీ ఫ్యాన్స్, ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే రామ్ హీరోగా త్రివిక్రమ్ సినిమా ఉంటుందా? అనే వార్తలు మొదలయ్యాయి. దీనికి కారణం స్రవంతి రవికిశోర్ మనసులోని మాటలను పంచుకోవడమే. ఆయన నిర్మాతగా ఈ దీపావళికి 'దీపావళి' అనే సినిమా విడుదల కానుంది. మేక పిల్లకి, ఓ చిన్న పిల్లాడికి ఉన్న అనుబంధంతో తెరకెక్కింది దీపావళి.

రాము, కాళి వెంకట్ కీలక పాత్రల్లో నటించిన సినిమా దీపావళి. తమిళంలో కీడ సినిమాకు అనువాదమిది. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కృష్ణ చైతన్య సమర్పిస్తున్నారు. ఆర్.ఎ.వెంకట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దీపావళి సెలబ్రిటీ షో చూసిన వారందరూ సినిమా సెన్సిబుల్‌గా ఉందని మెచ్చుకుంటున్నారు.

ఆ విషయాలు పంచుకోవడానికి మీడియాతో మాట్లాడారు నిర్మాత స్రవంతి రవికిశోర్. త్రివిక్రమ్‌తో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారనే ప్రశ్న ఆయనకు అప్పుడే ఎదురైంది. అందుకు సమాధానమిస్తూ ''త్రివిక్రమ్‌తో మళ్లీ సినిమా చేయాలని ఉంది. ఆ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తే చూడాలన్నది నా కోరిక. ఇప్పుడు త్రివిక్రమ్ ఎన్ని సినిమాలకు కమిట్ అయ్యారో చూసుకోవాలి.

ఆయన దగ్గర రామ్‌కి సరిపోయే కథ ఉండాలి. రామ్ హీరోగా తన కథను జనాలకు చెప్పాలని శ్రీను అనుకోవాలి. ఇవన్నీ జరిగితే సినిమా చేయాలని నాకూ ఉంది'' అని అన్నారు. 'నువ్వే నువ్వే' విడుదలై రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా త్రివిక్రమ్ తన కాళ్లకు నమస్కరించిన విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు... ''అలా చేయడం మా శ్రీను సంస్కారం.

మా జర్నీ చాలా గొప్పది. చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశాం. మా ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది'' అని అన్నారు రవికిశోర్. ప్రస్తుతం రామ్‌తో ఓ సినిమా చేస్తున్నారు స్రవంతి రవికిశోర్. ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కథ విషయంలో పర్టిక్యులర్‌గా ఉంటారు రవికిశోర్.

దీని గురించి మాట్లాడుతూ '' నేను చేసిన సినిమాలతో పోలిస్తే, చేయకుండా ఆపేసిన సినిమాలే ఎక్కువ. చాలా కథలు పక్కన పెట్టేశాను. రామ్ వరకు వాటిని తీసుకెళ్లలేదు. కథ సంపూర్ణంగా నచ్చినప్పుడే రామ్‌తో డిస్కస్ చేస్తాను. సినిమా చేస్తాను'' అని అన్నారు.