
తెలియక చేస్తే పొరపాటు.. తెలిసి చేస్తే తప్పు.. కానీ తప్పని తెలిసినా మళ్లీ మళ్లీ చేస్తున్నామంటే అది అలవాటు. ఇప్పుడదే చేస్తున్నారు తమిళ హీరోలు. వీళ్లు చూస్తున్నారులే అని తెలుగు ఆడియన్స్‌ని మరీ తక్కువంచనా వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళకిదే ఎక్కువలే అని అవమానిస్తున్నారు కూడా. రజినీ తర్వాత శివకార్తికేయన్ కూడా ఇదే చేస్తున్నారు.

తమిళ హీరోల తీరు చూసాక.. తెలుగు ఆడియన్స్ ఇదే అడుగుతున్నారిప్పుడు. చూడ్డానికి కాస్త కామెడీగా ఉంది కానీ సీరియస్ మ్యాటర్ ఇది. తమిళ హీరోలకు, నిర్మాతలకు తెలుగు కలెక్షన్లు కావాలి కానీ తెలుగు టైటిల్ మాత్రం పెట్టరు. మనకు అర్థం కాని అదే తమిళ టైటిల్‌నే తెలుగులోనూ పెడుతుంటారు.. చూస్తే చూడండి లేకపోతే లేదన్నట్లు..!

ఒక్కసారి అంటే ఏమో అనుకోవచ్చు కానీ.. మళ్లీమళ్ళీ అదే తప్పు చేస్తున్నారు తమిళ హీరోలు. ఎవరివరకో ఎందుకు.. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా తెలుగులో టైటిలే దొరకనట్లు వేట్టయన్ అంటూ తమిళ టైటిల్‌తోనే వచ్చారు. మొన్న దసరాకు వచ్చిన ఈ చిత్రం బాగున్నా కూడా తెలుగులో ఆడలేదు. దానికి ప్రధాన కారణం టైటిల్‌తోనే ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయిపోవడం.

గతంలో అజిత్ కూడా వలిమై, తునివు అంటూ మనకు సంబంధమే లేని టైటిల్స్‌తో వచ్చారు. ఒకవేళ చూడాలని అనిపించినా.. తమిళ టైటిల్స్ చూడగానే ఆఫ్ అయిపోతున్నారు ఆడియన్స్. తాజాగా శివకార్తికేయన్ కూడా అమరన్ అంటూ అదే అరవ టైటిల్‌తో వస్తున్నారు. అక్టోబర్ 31న విడుదల కానుంది ఈ చిత్రం. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మించడం గమనార్హం.

రెండు వేల కోట్ల టార్గెట్‌తో బరిలో దిగిన కంగువా 200 కోట్ల మార్క్ కూడా చేరుకోలేకపోయింది. కంగువా నిరాశపరచటంతో సూర్య కొద్ది రోజులు ఆడియన్స్ ముందుకు రారేమో అనుకున్నారు ఆడియన్స్.