
తెలుగు సినీ చరిత్రలో ఆయన పేరు, ప్రేక్షకుల గుండెల్లో ఆయన రూపం చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆయనే అక్కినేని నాగేశ్వరరావు. నటనకు నిలువెత్తు రూపం నాగేశ్వరరావు.

నేడు ఆ మహానటుడి జయంతి (సెప్టెంబర్ 20న అక్కినేని జయంతి)

ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేనిని చూశారు. ఆ తరువాత సినిమాలకు పరిచయం చేశారు.

ధర్మపత్ని సినిమాతో నాగేశ్వరరావు సినీజీవితానికి తెరలేచింది. అప్పటినుండి తెలుగు, తమిళ సినిమాలలో 75 సంవత్సరాల పైగా నటించారు.

మూడు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడుగా పురస్కారాలు అందుకున్నారు. భారతీయ సినిరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.

సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నటసామ్రాట్ బిరుదాంకితుడుగా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు.

1975 లో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్ లో మొదటి సినిమా కళ్యాణి. అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం. 1981 లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. ఇలా ఎన్నో మరపురాని చిత్రాలున్నాయి. తన అద్భుతమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు నాగేశ్వరరావు