
ప్రముఖ బెంగాలీ నటి స్వస్తిక ముఖర్జీ చిత్ర నిర్మాత సందీప్ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపు మెయిల్స్ పంపుతున్నారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మార్ఫింగ్ చేసిన ఫోటోలను పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నారని, అందులో నగ్న ఫోటోలు కూడా ఉన్నాయని తన ఫిర్యాదులో తెలిపింది. ఈ మేరకు స్వస్తిక గోల్ఫ్ గ్రీన్ పోలీస్ స్టేషన్‌లో నటి ఫిర్యాదు చేసింది.

తనకు వచ్చిన ఈమెయిల్ కాపీలు, ఫొటోలతోపాటు ఇతర సాక్ష్యధారలతో ఈస్టర్న్ ఇండియా మోషన్ పిక్చర్స్ అసోసియేషన్‌ను సంప్రదించనున్నట్లు నటి పేర్కొన్నారు. ప్రస్తుతం నటి స్వస్తిక ముఖర్జీ, పరంబ్రత ఛటర్జీతో కలిసి నటించిన 'శిబ్పూర్' చిత్రం మే 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు బెంగాలీ సినీ ఇండస్త్రీలో తీవ్ర దుమారం లేపాయి.

మరోవైపు స్వస్తిక ఆరోపణలను నిర్మాత సందీప్ సర్కార్ ఖండించారు. దర్శకుడు అరిందమ్ భట్టాచార్య తనపై ఆరోపణలు చేసేందుకు నటి స్వస్తికను ప్రేరేపించాడని పేర్కొన్నారు. అదంతా అబద్ధమని, స్వస్తిక లాంటి నటిని ప్రోత్సహిస్తానని, తాను ఎవరిపై ఎటువంటి నెగిటివ్ ప్రచారం చేయలేదని అరిందం భట్టాచార్య అంటున్నారు.

కాగా స్వస్తిక బెంగాలీ టీవీ సిరీస్ దేవదాసితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. బెంగాలీ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. హేమంతర్ పాఖీ (2001), ఆమె మస్తాన్ (2004). ముంబై కటింగ్ (2008) సినిమాలతో బాలీవుడ్‌లో పాపులారిటీ పొందారు.