
ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్, ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదివ్య.. మహేష్ బాబు గురించి షేర్ చేసిన కొన్ని పాత జ్ఞాపకాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా శ్రీదివ్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పాత ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆ ఫోటోలో మహేష్ బాబు చిన్నారి శ్రీదివ్యను ఎంతో అపురూపంగా ఎత్తుకుని ఉన్నారు. ఈ అరుదైన ఫోటో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనుక ఒక అందమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంది. మహేష్ బాబు కెరీర్ ప్రారంభంలో వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో వచ్చిన ‘యువరాజు’ (2000) సినిమాలో శ్రీదివ్య చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు

ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలను శ్రీదివ్య ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. "నేను చాలా చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాను. ‘యువరాజు’ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌లో మహేష్ బాబును చూసి ఎంతో ఆనందించేదాన్ని. అప్పట్లో ఆయన్ను ‘అన్నయ్య.. అన్నయ్యా..’ అని పిలిచేదాన్ని. నేను అలా పిలిచినప్పుడు ఆయన ఎంతో సరదాగా నవ్వుతూ నాకు చాక్లెట్లు ఇచ్చేవారు" అని శ్రీదివ్య చెప్పుకొచ్చారు. శ్రీదివ్య తన పాత జ్ఞాపకాలను పంచుకుంటూ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా మహేష్ బాబును ‘అన్నయ్య’ అని పిలిచిన ఈ చిన్నారేనా.. ‘బస్ స్టాప్’, ‘మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు’, ‘వారధి’ వంటి చిత్రాలతో హీరోయిన్‌గా మారిన శ్రీదివ్య అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు సెట్స్‌లో పిల్లలతో ఎంత సరదాగా, ప్రేమగా ఉంటారో ఈ సంఘటన మరోసారి నిరూపించిందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అప్పటి ‘అన్నయ్య’ పిలుపు నుంచి ఇప్పటి ‘వారణాసి’ గ్లోబల్ ప్రాజెక్ట్ వరకు మహేష్ బాబు క్రేజ్, చార్మ్ అస్సలు తగ్గలేదని, మరింత పెరిగిందని అభిమానులు సోషల్ మీడియాలో ఈ ఫోటోను షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

హోమ్లీ లుక్స్‌తో, బబ్లీ యాక్టింగ్‌తో టాలీవుడ్, కోలీవుడ్ ఆడియన్స్‌ను అలరించిన నటి శ్రీదివ్య (Sri Divya). చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీదివ్య కేవలం మూడేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా టెలివిజన్ సీరియల్స్, సినిమాల్లో నటించడం ప్రారంభించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'యువరాజు' (2000)తో పాటు 'హనుమాన్ జంక్షన్', 'వీడే' వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. రవిబాబు దర్శకత్వం వహించిన 'మనసారా' (2010) సినిమాతో ఆమె హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.

మారుతి దర్శకత్వంలో వచ్చిన 'బస్ స్టాప్' (2012) సినిమా శ్రీదివ్యకు యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత క్లాసిక్ ఫిల్మ్ 'మల్లెలతీరంలో సిరిమల్లెచెట్టు', దిల్ రాజు నిర్మించిన 'కేరింత', 'వారధి' వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో కెరీర్ ప్రారంభించినప్పటికీ, శ్రీదివ్యకు తమిళ చిత్ర పరిశ్రమ అఖండమైన విజయాన్ని, స్టార్ హోదాను ఇచ్చింది. శివకార్తికేయన్ సరసన నటించిన 'వరుత్తపడాత వాలిబర్ సంగం' (2013) సినిమా అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు గానూ ఆమె 'ఉత్తమ తొలిచిత్ర నటి'గా సైమా అవార్డును అందుకున్నారు.