
నటి సదా ఓ ఇంటర్వ్యూలో తన 20 ఏళ్ల సినీ ప్రస్థానం, కెరీర్ ఎదుగుదల, సవాళ్లు, వ్యక్తిగత అభిప్రాయాలపై ఆసక్తికర విషయాలను మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమలో తన సుదీర్ఘ ప్రయాణం గురించి, ప్రేక్షకులతో తనకున్న బంధం గురించి ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సదా మాట్లాడుతూ తన 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో తక్కువ సినిమాలు చేసినప్పటికీ, జయం, అపరిచితుడు, నితిన్, ఉదయ్ కిరణ్ వంటి నటులతో చేసిన చిత్రాలు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాయని సదా అన్నారు.

తన ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదని ప్రేక్షకులు తరచుగా భావిస్తుంటారని, ఈ ప్రశ్నలకు సమాధానం తన వద్ద కూడా లేదని, కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవని ఆమె అభిప్రాయపడ్డారు. జయం లాంటి పెద్ద హిట్ తర్వాత కూడా కెరీర్‌లో విరామం వచ్చిందని సదా గుర్తు చేసుకున్నారు. అవకాశాలు రాలేదని చెప్పలేనని, అవి తన వరకు చేరలేదని పేర్కొన్నారు. తాను ముంబైలో నివసించడం, అప్పట్లో సోషల్ మీడియా అంత బలంగా లేకపోవడం వల్ల ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేని తనకు, మధ్యవర్తులపై ఆధారపడాల్సి వచ్చిందని వివరించారు.

జయం తర్వాత తాను ఐటీ చదువులను కొనసాగించడానికి తిరిగి వెళ్ళినట్లు, సినిమా నేపథ్యం లేని తనకు నటన ఎంతవరకు విజయవంతమవుతుందో తెలియక అప్పట్లో కెరీర్‌ను నమ్మలేదని తెలిపింది. జయం లేదా అపరిచితుడు వంటి చిత్రాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో అప్పట్లో తనకు తెలియదని, ఈ విజయం తన జీవితంలో లేకపోతే తాను ఇక్కడ ఉండేదాన్ని కాదని ఆమె అన్నారు. తాను రెండు, మూడు సంవత్సరాలు సినిమాల నుండి అదృశ్యమైనప్పటికీ, తిరిగి వచ్చినప్పుడల్లా అదే ఆదరణ, ప్రేమ లభిస్తుందని సదా సంతోషంగా చెప్పారు.

జయం సినిమాలోని వెళ్ళవయ్యా వెళ్ళు అనే డైలాగ్ కోసం థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు ఉన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. నితిన్ సినిమాలో రీమేక్ అయిన రాను రానంటూనే చిన్నదో పాట గురించి మాట్లాడుతూ.. ఈ పాట రీమేక్‌లో సదాను అడిగారని, ఆమె నిరాకరించారని వార్తలు ఖండించారు సదా. తనను అడగలేదని, చాలాసార్లు ప్రాజెక్ట్ ఆఫర్‌లు తన వరకు చేరవని, నిర్మాతలు తాము ప్రయత్నించామని చెప్పినా, అది తన నంబరు చాలామంది దగ్గర ఉన్నప్పటికీ, మధ్యలో ఎక్కడ ఆగిపోతుందో తెలియదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

టార్చ్ లైట్ అనే తమిళ చిత్రం (తెలుగులో వేరే పేరుతో విడుదలైంది) గురించి మాట్లాడుతూ, ఒక బిడియమైన వ్యక్తిగా అలాంటి ధైర్యవంతమైన పాత్ర చేయడం చాలా భయంగా అనిపించిందని, అయితే అలాంటి కథను చెప్పడం అవసరమని భావించి చేశానని సదా తెలిపారు. అయితే, ప్రేక్షకులు దానిని ఒక మహిళ కథగా చూడకుండా, సదా ఎందుకు ఇలాంటి పాత్ర చేసింది అని విమర్శించారని, అది తనను షాక్‌కు గురిచేసిందని చెప్పారు. ఆ సినిమా చేసి తప్పు చేశా అని పించిందని ఆమె తెలిపారు. బోల్డ్ క్యారెక్టర్లు చేయకూడదన్నది తన సిద్ధాంతం కాదని, అయితే ఒక సబ్జెక్టుకు అది అవసరమైతే మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చింది సదా.