
హీరోయిన్ ప్రణీత లాక్ డౌన్ సమయంలో తన ప్రియుడు నితిన్ రాజును వివాహం చేసుకుంది. వీరిద్దరి వివాహం బెంగుళూరులోని ప్రణీత నివాసంలోనే జరిగినట్లుగా తెలుస్తోంది.

ఈ వివాహ వేడుకకు అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇక వివాహానికి హాజరైన ఓ సన్నిహితుడు ప్రణీత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

పెళ్లి కొడుకు నితిన్ రాజు బెంగళూరుకు చెందిన బిజినెస్‌మాన్ అని సమాచారం. ఇదిలా ఉంటే పెళ్లి వార్తలపై నటి ప్రణీత స్పందించింది.

"నేను, నితిన్ చాలా కాలం నుంచి మంచి ఫ్రెండ్స్. పెళ్ళితో మా బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుని ఇరు కుటుంబాల పెద్దలకు విషయం చెప్పాం. వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాది లవ్ కమ్ అరెంజెడ్ మ్యారేజ్. నా వ్యక్తిగత విషయాలు బయటపెట్టడం నాకు ఇష్టం లేదు" అని ప్రణీత వివరించింది.

పోర్కీ అనే కన్నడ చిత్రంతో ప్రణీత హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఏం పిల్లో ఏం పిల్లడో, బావ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రణీత తెలుగులో చాలా సినిమాల్లో నటించింది.

అత్తారింటికి దారేది, రభస, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమకోసమే వంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.

ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో తెరకెక్కుతున్న హంగామా 2లో నటిస్తున్నారు.