
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం (అక్టోబర్ 19) పున్నమి ఘాట్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అంతకు ముందు సీఎం చంద్రబాబు విజయవాడ బీసెంట్ రోడ్‌లో పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరల తగ్గుదలను గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు.

చింతజపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తాను ప్రమిదలు, జ్యూట్ బ్యాగులు విక్రయిస్తానని ఆయన వివరించారు. ఆయనకున్న సమస్యలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరుఫున అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.

మరో వీధి వ్యాపారి యక్కలి బాలకృష్ణతో మాట్లాడారు. చదలవాడ వెంకటకృష్ణారావు అనే చెప్పుల షాపు యజమానితో మాట్లాడారు. వ్యాపారం నడుస్తున్న తీరు, చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గింది, విక్రయాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

బట్టల షాపునకు వెళ్లి అందులో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోన్న గొడవర్తి లక్ష్మీ అనే మహిళతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. అనంతరం కిరాణా షాపు వద్దకు వెళ్లి నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్‌తో చంద్రబాబు మాట్లాడారు. నిత్యావసర వస్తువుల జీఎస్టీ తగ్గింపు ఎంత వరకు ఉందని, గతానికి ఇప్పటికీ ధరల వ్యత్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు.

జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు అందుతున్న ప్రయోజనాల గురించి విజయవాడలో కొందరు వీధి వ్యాపారులు, దుకాణాలను సందర్శించి వారితో మాట్లాడి తెలుసుకున్నాను

విజయవాడ బీసెంట్ రోడ్‌కు వచ్చిన కొందరు కొనుగోలు దారులతోనూ సీఎం మాట్లాడారు. వారితో ఫోటోలు దిగి ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఎప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు జనంలోకి రావడంతో అంతా షాక్ అయ్యారు. బీసెంట్ రోడ్‌లో సందడి చేసిన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారితో సెల్ఫీలుగా తీసుకున్నారు.