
ఎవరికి ఎంత ప్రోటీన్ అవసరం?:సాధారణ ఆరోగ్యవంతుడైన వ్యక్తి తన శరీర బరువులో ప్రతి కిలోకు 0.8 గ్రాముల నుండి 1 గ్రాము వరకు ప్రోటీన్ తీసుకోవాలి. అంటే మీరు 60 కిలోల బరువు ఉంటే రోజుకు 48 నుండి 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. అదే వ్యాయామం చేసే వారికైతే ఈ అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది.

ప్రోటీన్ లభ్యత విషయానికి వస్తే చికెన్, గుడ్లు బెస్ట్ ఆప్షన్స్. 100 గ్రాముల లీన్ చికెన్ ముక్కలో 25 నుండి 27 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనికి సమానమైన ప్రోటీన్ పొందాలంటే దాదాపు 4 పెద్ద గుడ్లు తినాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక 50 గ్రాముల గుడ్డులో 6 నుండి 7 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ప్రోటీన్ పరిమాణం పరంగా చూస్తే చికెన్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, పోషకాల విషయంలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది.

విటమిన్లు, మినరల్స్ పరంగా చూస్తే.. చికెన్‌లో పాస్పరస్, సెలీనియం, విటమిన్ B3 అధికంగా ఉంటాయి. మరోవైపు గుడ్లలో ఐరన్, జింక్, రాగి, సెలీనియం, విటమిన్ D, B12 వంటి విభిన్న పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన ఇతర సూక్ష్మ పోషకాలను అందించడంలో గుడ్లు ముందుంటాయి. అంతేకాకుండా గుడ్లు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారం.

బరువు తగ్గాలనే లక్ష్యం ఉన్నవారికి చర్మం లేని లీన్ చికెన్ అద్భుతమైన ఎంపిక. ఇందులో కొవ్వు తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది తిన్న తర్వాత ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఫలితంగా కేలరీల వినియోగం తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది.

మీకు కేవలం ప్రోటీన్ మాత్రమే ప్రధానం అయితే చికెన్ బెస్ట్. అయితే చికెన్ తినేటప్పుడు పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తులు కూడా తీసుకుంటే ప్రోటీన్ గ్రహణ శక్తి పెరుగుతుంది. ప్రోటీన్‌తో పాటు విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా కావాలనుకుంటే గుడ్లు మేలు. మీకు ఎలాంటి అలెర్జీలు లేకపోతే మీ డైట్‌లో ఈ రెండింటినీ సమతుల్యంగా చేర్చుకోవడం ఉత్తమం. మీ శరీర అవసరాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోండి.