
నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి. అయితే నిమ్మరసంలో ఉండే ఏ పదార్థమూ నేరుగా కొవ్వు కణాలను కరిగించలేదు. నిమ్మరసం తాగడం వల్ల బరువు తగ్గుతున్నారంటే, దానికి ప్రధాన కారణం అందులో ఉండే నిమ్మకాయ కాదు.. దానితో పాటు మీరు తాగే నీరు. శరీరానికి తగినంత నీరు అందడం వల్ల జీవక్రియ వేగవంతమై క్యాలరీలు ఖర్చవుతాయి.

చాలామంది ఉదయాన్నే అధిక క్యాలరీలు ఉండే టీ, కాఫీలు లేదా తీపి పానీయాలకు బదులుగా తక్కువ క్యాలరీలు ఉండే నిమ్మరసాన్ని ఎంచుకుంటారు. ఒక గ్లాసు నిమ్మరసంలో కేవలం 10 నుంచి 15 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అధిక క్యాలరీల పానీయాలను దీనితో రీప్లేస్ చేయడం వల్ల రోజువారీ క్యాలరీల పరిమాణం తగ్గి, పరోక్షంగా బరువు తగ్గడానికి మార్గం సుగమమవుతుంది. అంటే ఇది కేవలం క్యాలరీ మేనేజ్‌మెంట్‌లో మాత్రమే సహాయపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరచడంలో నిమ్మరసం కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేసినప్పుడు కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, టాక్సిన్లను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. జీర్ణక్రియ బాగుంటే శరీరం పోషకాలను సరిగ్గా గ్రహిస్తుంది, ఇది బరువు నియంత్రణ ప్రక్రియకు ఎంతో అనుకూలంగా మారుతుంది.

నిమ్మరసం ప్రతిఒక్కరికీ ఒకేలా సరిపడదు. రోజూ పరిమితికి మించి నిమ్మరసం తాగడం వల్ల దానిలోని సిట్రిక్ యాసిడ్ పళ్లపై ఉండే ఎనామిల్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే అసిడిటీ, గ్యాస్ట్రిక్ లేదా అల్సర్ సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగితే కడుపులో మంట మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీ శరీర తత్వానికి తగినట్లుగానే దీనిని తీసుకోవాలి.

నిమ్మరసం అనేది బరువు తగ్గడానికి ఒక సహాయకారి మాత్రమే తప్ప, అదే పూర్తి పరిష్కారం కాదు. సరైన ఆహార నియమాలు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర ఉంటేనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది. కాబట్టి నిమ్మరసాన్ని ఒక మంచి ఆరోగ్యకరమైన అలవాటుగా మాత్రమే చూడాలి కానీ, బరువు తగ్గించే అద్భుత ఔషధంగా భావించకూడదు.